ఆ ఒక్క‌డే రూ.246 కోట్లు డిపాజిట్ చేశాడు

Update: 2017-03-27 06:30 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత వెలుగులోకి వ‌స్తున్న బ్లాక్ మ‌నీ ఉదంతాల్లో తారాస్థాయికి చేరిన అంశ‌మిది. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి భారీ మొత్తంలో రద్దయిన పెద్ద నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేశాడు. తమిళనాడు నమక్కల్ జిల్లా తిరుచెంగొడేకు చెందిన ఓ వ్యాపారవేత్త ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు బ్రాంచ్‌లో రూ. 246 కోట్లను జమ చేశాడు. ఇంత పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ కావడంతో ఐటీ అధికారులు ఆ ఖాతాదారుడిపై దృష్టిసారించారు. 15 రోజులుగా అతను అధికారులకు అందుబాటులోకి రాకుండా దాక్కుని పోయాడు. మొత్తం మీద పట్టుబడి ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన(పీఎంజీకేవై) పథకం కింద చేరుతున్నట్లు.. జమ చేసిన నగదు మొత్తంపై 45 శాతం ట్యాక్స్‌గా చెల్లించనున్నట్లు పేర్కొన్నాడు.

నోట్ల రద్దు ప్రకటించిన తర్వాత 200 మందికి పైగా వ్యక్తులు, పలు కంపెనీలు లెక్కలో చూపని రూ. 600 కోట్లను తమిళనాడు, పుదుచ్చేరిలోని వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. వీరిలో చాలా మంది పీఎంజీకేవై పథకంలో చేరారు. ఈ పథకం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. జవాబుదారితనం లేని ఈ మొత్తం నగదు డిపాజిట్ ఈ నెలాఖరు వరకు రూ. వెయ్యి కోట్లకు చేరుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. పీఎంజీకేవై పథకంలో చేరని వ్యక్తులపై ఏప్రిల్ ఒకటో తేది నుంచి తీవ్ర చర్యలు తీసుకోనున్నట్లు ఐటీ వర్గాలు పేర్కొన్నాయి.

లెక్కలో చూపని మొత్తాన్ని ప్రజలు నగదు, చెక్కులు, డీడీ రూపాల్లో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పద్దతుల్లో పీఎంజీకేవై పథకం కింద ఏ బ్యాంకు బ్రాంచ్‌లోనైనా డిపాజిట్ చేయవచ్చు. ఇలా జమ చేసిన నగదు మొత్తంలో 50 శాతం నగదును ట్యాక్స్‌గా తీసుకుంటారు. మిగతా 25 శాతం నగదును వడ్డీచెల్లింపులు లేకుండా నాలుగు సంవత్సరాల బాండ్‌తో ఆర్‌బీఐ వద్ద ఉంచుతారు. మిగిలిన 25 శాతం నగదును మాత్రమే డిపాజిట్‌దారుడు వాడుకునే అవకాశం. కాగా లాండరింగ్ పద్దతుల్లో అదేవిధంగా నేరపూరితంగా వచ్చిన నగదును పీఎంజీకేవై పథకం కింద జమ చేసుకోమని అధికారులు పేర్కొన్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News