స్వతంత్ర ఎంపిగా గుర్తించాలట!

Update: 2021-06-15 04:30 GMT
తనను స్వతంత్ర ఎంపిగా గుర్తించాలని వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపి రఘురామ కృష్ణంరాజు కోరుకుంటున్నారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను కలిసి రిక్వెస్టు చేశారు. వైసీపీ అధికారిక వెబ్ సైట్ లో ఎంపిల జాబితా నుండి తన పేరును పార్టీ నాయకత్వం తొలగించిందని ఫిర్యాదుచేశారు. వెబ్ సైట్లో పేరులేదు కాబట్టి తనను స్వతంత్ర ఎంపిగా గుర్తించాలని స్పీకర్ కు లేఖ ఇవ్వటమే విచిత్రంగా ఉంది.

పార్టీ వెబ్ సైట్లో పేరు లేనంతమాత్రాన సదరు ఎంపిని స్పీకర్ స్వతంత్ర ఎంపిగా గుర్తించరన్న విషయం రాజుగారికి తెలీకుండానే ఉంటుందా ? పైగా ఎంపిపై అనర్హత వేటు వేయాలని ఇఫ్పటికే పార్టీ స్పీకర్ కు నోటీసు కూడా ఇచ్చింది. ఆ విషయాన్ని స్పీకర్ పరిశీలిస్తున్నారు. ఎక్కడ తనపై అనర్హత వేటు పడుతుందో అన్న ఆందోళనతోనే ఎంపి స్పీకర్ ను కలిసి తనపై అనర్హత వేటు వేసేందుకు లేదని విజ్ఞప్తి చేశారు.

నిజానికి పార్టీ ఇచ్చిన నోటీసు ప్రకారం చూసుకుంటే ఎంపిపై ఎప్పుడో అనర్హత వేటు పడాల్సింది. కాకపోతే రాజకీయ కారణాల వల్లే ఎంపిపై ఇంతకాలంగా అనర్హత వేటు పడలేదు. ఎందుకంటే అనేక ఆరోపణలతో జనతాదళ్ ఎంపి శరద్ యాదవ్ పై అనర్హత వేటు వేయాలని పార్టీ కోరిన వెంటనే రాజ్యసభ ఛైర్మన్ అనర్హత వేటు వేసేశారు. యాదవ్ మీద వెంటనే అనర్హత వేటు వేసినపుడు రఘురామ మీద మాత్రం ఎందుకని ఏడాదిగా వేటు వేయలేదంటే కేవలం రాజకీయ కారణాలే అని అర్ధమైపోతోంది.

జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ టూర్ తర్వాత అనర్హత వేటు విషయంలో కదలిక వచ్చిందని సమాచారం. ఆ విషయాన్ని గ్రహించిన ఎంపి వెంటనే స్పీకర్ తో భేటీ అయ్యారు. పార్టీలోనే ఉంటు జగన్ కు వ్యక్తిగతంగానే కాకుండా పార్టీకి కూడా వ్యతిరేకంగా ఎంపి వ్యవహరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతచేస్తు కూడా తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం లేదని సమర్ధించుకోవటమే విచిత్రంగా ఉంది.
Tags:    

Similar News