బుడ్డోడూ మోడీని అనేశాడు

Update: 2016-12-16 04:21 GMT
ప్రధానిగా రెండున్నరేళ్లు గడిచినా.. ప్రతిపక్షాలు సూటిగా నిలదీసేలా ఒక్క ఆరోపణకు అవకాశం ఇవ్వకుండా పాలించిన మోడీకి.. పెద్దనోట్ల రద్దు నిర్ణయం అటు తిరిగి ఇటు తిరిగి ఆయనకే చుట్టుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వ్యవస్థలోని లోపాలు.. ఆయనకు శాపాలుగా మారుతున్నాయి. తీసుకున్న నిర్ణయం మంచిదేనని మాజీ ప్రధాని కమ్ ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ లాంటి వారు సైతం కితాబు ఇస్తున్నా.. రద్దు నిర్ణయాన్ని అమలు విషయంలోనే అసలు సమస్యంతా వచ్చి పడుతోంది.

పెద్దనోట్ల రద్దుతో నల్ల కుబేరులకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందన్న మాటలు మొదట్లో వినిపించినా.. అంత లేదన్న విషయం రోజులు గడుస్తున్న కొద్దీ అర్థమవుతోంది. రద్దు నిర్ణయాన్ని ప్రకటించి 37 రోజులు పూర్తి అయినా.. నోట్ల కష్టాలతో సామాన్యుడు విలవిలలాడిపోతున్నాడు. ఏ ఏటీఎం ముందు చూసినా.. బ్యాంకు ముందు చూసినా భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. డెబిట్.. క్రెడిట్ కార్డులు లేని వారి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

బ్యాంకు ఖాతాలో డబ్బులున్నా.. చేతికి డబ్బులు రాని తీరుపై సామాన్యులు చిరాకు పడిపోతున్నారు. ఇలాంటి కష్టాలు ఏ వారమో.. పది రోజులో ఉంటాయని అనుకుంటే.. అది కాస్తా నెల గడిచి.. రెండో నెలలోకి అడుగు పెట్టినా.. సమస్య మాత్రం తీరటం లేదు. ఇదిలా ఉంటే.. ప్రజలు పడుతున్న కష్టాల్ని.. తన బుజ్జి బుజ్జి మాటలతో మోడీని అడిగేసిన ఒక బుడ్డోడు ఆన్ లైన్ లో ఇప్పుడు హడావుడి చేస్తున్నాడు.

నోట్ల రద్దు నిర్ణయం అనంతరం.. సోషల్ మీడియాలో వస్తున్న జోకులు అన్ని ఇన్ని కావు. ఇవి చాలవన్నట్లు.. ఒక బుడ్డోడు.. సామాన్యుల కష్టాల్ని ఏకరువు పెడుతున్న మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బుడ్డోడికి ఒకమహిళ మాటల్నిఅందించటం..వాటిని తూచా తప్పకుండా పిల్లోడు వల్లెవేయటం.. వాటికి తన హావ భావాల్ని యాడ్ చేయటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రానున్న రోజుల్లో మోడీ.. ఇలాంటివెన్ని చూడాల్సి వస్తుందో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News