ఢిల్లీ సర్కారు తీరును తప్పు పడుతూ 2 ఏళ్ల పిల్లాడు కోర్టుకెక్కాడు

Update: 2020-06-10 04:32 GMT
పిట్ట కొంచెం కూత ఘనం అన్న చందంగా.. రెండేళ్ల చిన్నారి ఒకరు ఢిల్లీ సర్కారుపై కోర్టుకెక్కిన వైనం సంచలనంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తనకు మాయదారి జబ్బు ముప్పు ముంచుకొచ్చిందన్న ఆందోళనను వ్యక్తం చేశారు. కోర్టు కల్పించుకొని ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చాలని కోరారు. ఇంతకీ రెండేళ్ల పిల్లాడు ఏ అంశం మీద కోర్టును ఆశ్రయించారంటారా? అక్కడికే వస్తున్నాం. ఇటీవల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం విచిత్రమైన నిర్ణయాన్ని తీసుకుంది. మహమ్మారి లక్షణాలు బయటకు రాని వారికి నిర్దారణ పరీక్షలు చేయొద్దంటూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం తీసుకుంది.

దీన్ని తప్పు పడుతూ రెండేళ్ల పిల్లాడు కోర్టుకు ఎక్కాడు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తనకు ప్రమాదకరంగా మారుతుందన్న వాదనను వినిపిస్తున్నాడు. తన తల్లిదండ్రులు ఇద్దరూఉద్యోగులని.. వారు విధుల హాజరుకు బయటకు వెళ్లి రావాల్సి వస్తుందన్నాడు. వారి ద్వారా తనకు మాయదారి రోగం సోకే ప్రమాదం ఉందని.. అలాంటప్పుడు నిర్దారణ పరీక్షలకు అనుమతి ఇవ్వకపోతే ఎలా? అన్నది అతడి ప్రశ్న.

తన తండ్రి సాయంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లక్షణాలు లేని రోగుల కారణంగా అతి తక్కువ సమయంలో ఎక్కువగా వ్యాప్తి చెందే వీలుందన్నారు. ఇలాంటివారి కారణంగా పిల్లలు.. పెద్ద వయస్కులకు ప్రమాదం పొంచి ఉందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ బుడతడు వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీఎన్ పటేల్.. జస్టిస్ ప్రతీక్ జలాన్ లతో కూడిన ధర్మాసనం విచారించనుంది.

నిర్దారణ పరీక్షలకు అనుమతించటం ద్వారా మాయదారి రోగం వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నాడు. దీంతో.. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కేసుల్ని తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మధ్యనే ఢిల్లీ రాష్ట్ర సర్కారు మరో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఢిల్లీ యేతర వారికి పాజిటివ్ అయితే.. ఆసుపత్రుల్లో చికిత్స చేయమని చెప్పింది. ఈ నిర్ణయాన్ని ఢిల్లీ లెఫ్టెనెంట్ గవర్నర్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. సామాన్యుడి సర్కారు అని చెప్పే కేజ్రీవాల్.. ఈ తరహా నిర్ణయాలు తీసుకోవటమా? అన్న విస్మయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News