టోక్యో ఒలంపిక్స్: 9 వ రోజు హైలెట్స్ .. చరిత్ర సృష్టించిన పీవీ సింధు

Update: 2021-08-02 04:08 GMT
టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత అథ్లెట్లు దూసుకొని పోతున్నారు. మంచి విజయాలతో భారత్‌కు సూపర్ సండే గా మారింది.  మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు గెలిచి కాంస్య పతకం సొంతం చేసుకున్నది.  పురుషుల బాక్సింగ్ 91+ కేజీల విభాగంలో సతీశ్ కుమార్ పోరాడి ఓడాడు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన బర్ఛోదిర్ జలలోవ్‌ చేతిలో 0-5 తేడాతో ఓడిపోయాడు. భారత పురుషుల హాకీ జట్టు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది.

శతకోటి భారతావని అంచనాల భారాన్ని మోస్తూ టోక్యోలో అడుగుపెట్టిన భారత స్టార్‌ షట్లర్‌ పూసర్ల వెంకట సింధు. కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఆదివారం మూడో స్థానం కోసం జరిగిన పోరులో ప్రపంచ చాంపియన్‌ సింధు 21-13, 21-15తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్‌ హే బింగ్‌ జియావో  పై విజయం సాధించింది. తద్వారా ఒలింపిక్స్‌లో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన తొలి భారత మహిళగా రికార్డుల్లోకెక్కింది. సుశీల్‌ కుమార్‌ (2008లో కాంస్యం, 2012లో రజతం) తర్వాత భారత్‌ తరఫున రెండు పతకాలు నెగ్గిన రెండో అథ్లెట్‌ గా నిలిచింది. ఓవరాల్‌ గా ఒలింపిక్స్‌ బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ చరిత్రలో వరుసగా రెండు పతకాలు సాధించిన నాలుగో షట్లర్‌ గా సింధు చరిత్రెకెక్కింది. టోక్యో ఒలింపిక్స్‌ లో భారత్‌ కు రెండో పతకాన్ని అందించింది సింధు. పోటీల తొలిరోజే మీరాబాయి చాను రజతం నెగ్గిన విషయం తెలిసిందే.

సెమీస్‌ లో తైజూ యింగ్‌ చేతిలో పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న సింధు.. మూడో ప్లేస్‌ కోసం జరిగిన పోరులో పూర్తి ఆధిపత్యం కనబర్చింది. తొలి గేమ్‌ ప్రారంభంలో 4-0తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు.. 11-8తో ముందంజలో నిలిచి.. అదే జోరులో గేమ్‌ సొంతం చేసుకుంది. ఇక రెండో గేమ్‌ లోనూ 4-1తో ముందడుగేసిన తెలుగమ్మాయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస పాయింట్లతో గేమ్‌ ను చేజిక్కించుకుంది. మహిళల సింగిల్స్‌లో చెన్‌ యూ ఫీ స్వర్ణం, తైజూ యింగ్‌ రజతం గెలుచుకున్నారు. ఇక, బాక్సింగ్‌ లో పతకం ఖాయం చేసుకున్న లవ్లీనా బుధవారం సెమీస్‌ బరిలో దిగనుంది.

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారత పురుషుల హాకీ టీమ్ సంచ‌ల‌నం సృష్టించింది. 41 ఏళ్ల త‌ర్వాత ఒలింపిక్స్ సెమీఫైన‌ల్లో భారత్ అడుగుపెట్టింది. ఆదివారం జ‌రిగిన క్వార్ట‌ర్‌ ఫైన‌ల్ మ్యాచ్‌ లో ఇండియా 3-1 గోల్స్ తేడాతో గ్రేట్ బ్రిట‌న్‌ పై అద్భుత విజ‌యం సాధించింది. ఒలింపిక్స్‌ లో ఒక‌ప్పుడు 8 గోల్డ్ మెడ‌ల్స్ సాధించినా.. త‌ర్వాత క‌ళ త‌ప్పిన భార‌త హాకీ జట్టు ఈసారి అద్భుత‌మే చేసింది. టోర్నీ మొత్తం నిల‌క‌డ‌గా రాణిస్తున్న మ‌ణ్‌ప్రీత్ సింగ్ సేన.. లీగ్ స్టేజ్‌ లో 5 మ్యాచ్‌ల‌కు గాను ఏకంగా 4 విజయాలు అందుకుంది. భారత్ త‌ర‌ఫున దిల్‌ప్రీత్ సింగ్‌, హార్దిక్ సింగ్‌, గుర్జిత్ సింగ్ తలో గోల్స్ చేశారు. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు బ్రిటన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడింది. గోల్‌ చేయనీకుండా అడ్డుకుంది.

మ్యాచ్‌ తొలి క్వార్టర్‌లో ఏడో నిమిషంలో దిల్‌ ప్రీత్‌ సింగ్‌ గోల్‌ చేయగా.. రెండో క్వార్టర్‌ లో 16వ నిమిషంలో గుర్జత్‌ సింగ్‌ మరో గోల్‌ సాధించాడు. దీంతో మ్యాచ్‌ విరామ సమయానికి భారత్‌ 2-0 పాయింట్ల ఆధిక్యంతో కొనసాగింది. 45వ నిమిషంలో బ్రిటన్‌ తొలి గోల్‌ చేసింది. దీంతో మూడో క్వార్టర్‌ పూర్తయ్యేసరికి బ్రిటన్‌ ఒక గోల్‌ చేసి స్కోర్‌ 2-1గా మార్చింది. నాలుగో క్వార్టర్‌లో 57వ నిమిషంలో హార్దిక్‌ సింగ్‌ మూడో గోల్‌ చేసి భారత్‌ జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత బ్రిట‌న్‌ మరో గోల్ చేయలేదు. భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ఎనిమిది సార్లు ఒలింపిక్‌ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టు.. మంగళవారం జరుగనున్న సెమీఫైనల్‌ పోరులో ప్రపంచ చాంపియన్‌ బెల్జియంతో అమీతుమీ తేల్చుకోనుంది. విశ్వక్రీడల్లో భారత్‌ చివరి సారి 1980లో స్వర్ణ పతకం సాధించగా.. అప్పుడు ఒలింపిక్స్‌లో ఆరు జట్లే పాల్గొనడంతో సెమీ ఫైనల్‌ నిర్వహించలేదు. ఈ లెక్కన 1972 మ్యూనిచ్‌ విశ్వ క్రీడల్లో సెమీస్‌ చేరిన తర్వాత భారత్‌ మరోసారి ఈ ఘనత సాధించడం ఇదేతొలిసారి.

ఇకపోతే , సింధు విజయం పై మాట్లాడుతూ .. ఇన్నేళ్లుగా  ప‌డుతున్న క‌ష్టానికి ప్ర‌తిఫ‌లం ద‌క్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్ర‌స్తుతం న‌న్నుచాలా ఎమోష‌న్స్ వెంటాడుతున్నాయి. కాంస్య ప‌త‌కం గెలిచినందుకు సంతోషించాలో.. ఫైన‌ల్‌ లో ఆడే అవ‌కాశాన్ని పోగొట్టుకున్నందుకు బాధ‌ప‌డాలో అర్థం కావ‌డం లేదు. ఏదేమైన‌ప్ప‌టికీ ఈ మ్యాచ్ ఆడే స‌మ‌యంలో నా భావోద్వేగాలు అన్నింటినీ ప‌క్క‌న‌పెట్టేసి.. నా శాయ‌శ‌క్తుల ఆడాను. ఇప్పుడు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి మెడ‌ల్ సాధించిపెట్టినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా అంటూ పీవీ సింధు చెప్పుకొచ్చింది. త‌న‌పై ప్రేమాభిమానాలు చూపించిన అభిమానుల‌కు ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాన‌ని చెప్పింది. ఒలింపిక్స్‌లో గెల‌వ‌డం ప‌ట్ల చాలా సంతోషంగా ఉంద‌ని.. ఈ మ‌ధుర క్ష‌ణాల‌ను చాలా ఎంజాయి చేస్తున్నాన‌ని పీవీ సింధు తెలిపింది. త‌న గెలుపు కోసం కుటుంబ‌స‌భ్యులు ఎంతో క‌ష్ట‌ప‌డ్డార‌ని పేర్కొంది. అలాగే స్పాన్స‌ర్స్ కూడా ఎంత‌గానో ప్రోత్స‌హించార‌ని చెప్పింది. ఈ సంద‌ర్భంగా వారంద‌రికీ కృతజ్ఞ‌త‌లు తెలిపింది. అలాగే 2024లో పారిస్‌ లో జ‌ర‌గ‌బోయే ఒలింపిక్స్‌ లోనూ క‌చ్చితంగా ప‌త‌కం సాధిస్తాన‌ని ధీమా వ్య‌క్తం చేసింది.
Tags:    

Similar News