టోక్యో ఒలంపిక్స్: ఏడో రోజు హైలెట్స్ .. పథకాల వేటలో భారత్ దూకుడు !

Update: 2021-07-31 04:29 GMT
ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌ లో శుక్రవారం భారత అథ్లెట్లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. బాక్సింగ్‌ లో లవ్లీనా బొర్గోహై సెమీ ఫైనల్‌ లో అడుగుపెట్టి పతకం ఖరారు చేసుకోగా.. తెలుగు తేజం పీవీ సింధు క్వార్టర్స్‌ లో యమగూచిని మట్టికరిపించి సెమీస్‌ కు దూసుకెళ్లింది. హాకీలో పురుషుల, మహిళల జట్లు చక్కటి విజయాలు నమోదు చేయగా,ఎన్నో అంచనాలు పెట్టుకున్న షూటింగ్‌, ఆర్చరీలో భారత్‌కు నిరాశ తప్పలేదు. స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ వంద మీటర్ల రేసులో ప్రభావం చూపలేకపోగా.. తొలిసారి ఒలింపిక్‌ బరిలో దిగిన ఈక్వెస్ట్రియన్‌ ఫవాద్‌ మీర్జా ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.

భారీ అంచనాలతో టోక్యోలో అడుగుపెట్టిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పూసర్ల వెంకట సింధు.. తన చిరకాల స్వప్నమైన ఒలింపిక్‌ స్వర్ణానికి రెండడుగుల దూరంలో నిలిచింది. శుక్రవారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ లో ప్రపంచ చాంపియన్‌ సింధు 21-13, 22-20తో ఐదో ర్యాంకర్‌ అకానె యమగూచి (జపాన్‌)పై నెగ్గి సెమీస్‌ లో అడుగుపెట్టింది. 56 నిమిషాల్లో ముగిసిన పోరులో తొలి గేమ్‌లో ప్రత్యర్థి నుంచి పెద్దగా పోటీ ఎదురుకాకపోవడంతో అలవోకగా ముందడుగు వేసిన తెలుగమ్మాయి.. రెండో గేమ్‌ లో చెమటోడ్చి నెగ్గింది. శనివారం సెమీస్‌ లో ప్రపంచ నంబర్‌వన్‌ తైజూ యింగ్‌ (చైనీస్‌ తైపీ)తో సింధు తలపడనుంది. ఈ ఇద్దరు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా, అందులో తైజూ 13 సార్లు విజయం సాధించడం భారతీయులను కలవరపాటుకు గురిచేస్తున్నది.

విశ్వక్రీడల తొలిరోజు లిఫ్టర్‌ మీరాబాయి చాను రజతం సాధించిన తర్వాత ఆరు రోజులుగా పతకం కోసం కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న భారతీయులకు లవ్లీనా బొర్గోహై చల్లటి కబురు చెప్పింది. శుక్రవారం మహిళల 69 కేజీల క్వార్టర్‌ ఫైనల్‌లో లవ్లీనా 4-1తో చిన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ)ను చిత్తుచేసి సెమీఫైనల్‌ లో అడుగుపెట్టడం ద్వారా కనీసం కాంస్య పతకం ఖాయం చేసుకుంది. బౌట్‌ ఆరంభం నుంచే దూకుడుగా కనిపించిన లవ్లీనా.. మూడో రౌండ్‌ లో తన అద్వితీయ డిఫెన్స్‌ తో కట్టిపడేసింది. చిన్‌ చెన్‌ చేతిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు ఓడిన లవ్లీనా.. కీలక పోరులో తన ఎత్తును వినియోగించుకుంటూ వరుస పంచ్‌ లతో విరుచుకుపడింది.  లండన్‌ (2012) ఒలింపిక్స్‌లో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ కాంస్యం నెగ్గాక.. బాక్సింగ్‌ లో భారత్‌ కు మరో పతకం ఖాయం కావడం ఇదే తొలిసారి.  

ఇప్పటికే క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరుకున్న భారత పురుషుల హాకీ జట్టు.. చివరి లీగ్‌ మ్యాచ్‌ లో చక్కటి విజయాన్నందుకుంది. గుర్జాంత్‌ (17వ, 56వ నిమిషాల్లో) డబుల్‌ ధమాకాకు హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ (13వ ని), శంషేర్‌ సింగ్‌ (34వ ని), నీలకంఠ శర్మ (51వ ని) గోల్స్‌ తోడవడంతో పూల్‌-ఏలో భాగంగా శుక్రవారం జరిగిన పోరులో భారత్‌ 5-3తో జపాన్‌ ను చిత్తుచేసింది. ఈ విజయంతో భారత జట్టు  12 పాయింట్లతో రెండో స్థానంతో గ్రూప్‌ దశను ముగించింది. భారీ అంచనాల మధ్య టోక్యో బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టు ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. హ్యాట్రిక్‌ పరాజయాల అనంతరం శుక్రవారం తప్పక గెలువాల్సిన మ్యాచ్‌ లో రాణి రాంపాల్‌ బృందం 1-0తో ఐర్లాండ్‌ పై విజయం సాధించింది. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా.. నవ్‌ నీత్‌ కౌర్‌ (57వ నిమిషంలో) గోల్‌ కొట్టి భారత క్వార్టర్స్‌ ఆశలు నిలబెట్టింది.

టీమ్‌ ఈవెంట్‌లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ప్రపంచ నంబర్‌ వన్‌ ఆర్చర్‌ దీపిక కుమారి.. వ్యక్తిగత విభాగంలోనూ నిరాశ పరిచింది. దీపిక శుక్రవారం క్వార్టర్స్‌లో 0-6తో టాప్‌ సీడ్‌ అన్‌ సన్‌ (కొరియా) చేతిలో ఓటమి పాలైంది. మరోవైపు వరుసగా రెండో ఒలింపిక్స్‌ లో భారత పిస్టల్‌ షూటర్లు రిక్తహస్తాలతో వెనుదిరిగారు. మహిళల 25 మీటర్ల పిస్టల్‌ క్వాలిఫికేషన్‌ రౌండ్‌ లో పోటీపడ్డ మనూబాకర్‌ (582 పాయింట్లు) 15వ, రాహిసర్ణోబత్‌ (573 పాయింట్లు) 32వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.

గోల్ఫ్‌ పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ ప్లే తొలి రౌండ్‌ లో అనిర్బన్‌ లాహిరి 20వ ఉదయన్‌ 57వ స్థానాల్లో నిలిచారు. ఈక్వెస్ట్రియన్‌ లో ఫవాద్‌ మీర్జా తొలి రోజు పోటీలు ముగిసే సమయానికి 7వ ప్లేస్‌ లో నిలిచాడు. సెయిలింగ్‌ లో విష్ణు శరవణన్‌ 20వ.. గణపతి-వరుణ్‌ జోడీ 17వ స్థానంలో నిలిచింది. మహిళల విభాగంలో నేత్ర 35వ పేస్ల్‌తో ముగించింది. మహిళల 100 మీటర్ల రేసులో స్టార్‌ స్ప్రింటర్‌ ద్యుతీచంద్‌ 11.54 సెకన్లలో లక్ష్యాన్ని చేరి 54 మంది పోటీదారుల్లో 45వ స్థానంలో నిలిచింది. 3 వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో అవినాశ్‌.. 400 మీటర్ల హర్డిల్స్‌లో జాబీర్‌ నిరాశ పరచగా.. 4×400 మిక్స్‌డ్‌ రిలే టీమ్‌లో భారత జట్టు హీట్స్‌లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది.

ఇక శనివారం ఇప్పటి వరకు ఉన్న ఒలంపిక్స్  అప్డేట్ ఒకసారి చూస్తే ..

ఇండియ‌న్ ఆర్చ‌ర్ అతాను దాస్ ఒలింపిక్స్ ఫైట్‌ ప్రిక్వార్ట‌ర్స్‌ తోనే ముగిసింది. శ‌నివారం ఉద‌యం జ‌రిగిన రౌండ్ ఆఫ్ 8లో అత‌డు జ‌పాన్‌ కు చెందిన ఫురుకువ త‌క‌హ‌రు చేతిలో 4-6తో ఓడిపోయాడు. ఐదు సెట్ల పాటు హోరాహోరీగా జ‌రిగిన ఈ మ్యాచ్‌ లో అతాను రెండు సెట్లు కోల్పోయి ప‌రాజ‌యం పాల‌య్యాడు. మూడో సెట్‌లో మాత్ర‌మే అతాను గెల‌వ‌గా.. రెండు, నాలుగు సెట్‌ ల‌లో ఇద్ద‌రు అథ్లెట్లు ఒకే స్కోరు సాధించారు.

ఇండియ‌న్ డిస్క‌స్ త్రోయ‌ర్ క‌మ‌ల్‌ ప్రీత్ కౌర్ ఫైన‌ల్ చేరింది. శ‌నివారం ఉద‌యం జ‌రిగిన క్వాలిఫికేష‌న్‌ లో ఆమె 64 మీట‌ర్ల దూరం విసిరి.. ఫైన‌ల్లో స్థానాన్ని ఖాయం చేసుకుంది. అంతేకాదు మొత్తం గ్రూప్ ఎ, గ్రూప్ బి క్వాలిఫికేష‌న్ల‌లో క‌లిపి క‌మ‌ల్‌ ప్రీత్ విసిరిందే రెండో అత్య‌ధిక దూరం కావ‌డం విశేషం. తొలి ప్ర‌యత్నంలో 60.59 మీట‌ర్ల దూరమే విసిరిన ఆమె.. రెండో ప్ర‌య‌త్నంలో ఏకంగా 63.97 మీట‌ర్లు, మూడో ప్ర‌య‌త్నంలో 64 మీట‌ర్ల మార్క్ అందుకుంది. ఇక ఈ ఈవెంట్‌ లోనే గ్రూప్ ఎలో పార్టిసిపేట్ చేసిన మ‌రో ఇండియ‌న్ డిస్క‌స్ త్రోయ‌ర్ సీమా పూనియా 60.57 మీట‌ర్ల దూరమే విసిరి ఫైన‌ల్‌ కు క్వాలిఫై కాలేక‌పోయింది. 
Tags:    

Similar News