టోక్యో ఒలంపిక్స్ : సెమీస్‌లో భజరంగ్‌ ఓటమి .. గ్రౌండ్ లోనే కంటతడి పెట్టిన అమ్మాయిలు !

Update: 2021-08-06 12:47 GMT
జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ ఈ  రోజు భారత్ కి పెద్దగా కలిసి రావడంలేదు.  సెమీ ఫైనల్స్ గండం నుంచి తప్పించుకోలేకపోయింది. మహిళల హాకీ విభాగంలో భారత జట్టు కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్ చేతిలో పోరాడి ఓడింది. ఈ ఓటమిని జీర్ణించుకోలేని పరిస్థితుల్లోనే మరో పరాజయం పలకరించింది. భారత స్టార్ రెజ్లర్ బజరంగి పునియా ఓడిపోయాడు. అతను కూడా సెమీ ఫైనల్స్ గండాన్ని దాటలేకపోయాడు. పసిడి పతకం కోసం సాగించిన పోరులో చివరి వరకూ నిలిచినా.. ఓటమి కోరల నుంచి బయటపడలేకపోయాడు. పతకం ఆశలను మాత్రం సజీవంగా నిలుపుకోగలిగాడు.

కాంస్య పతకం కోసం మరో బౌట్‌ను బజరంగి పునియా ఎదుర్కొనాల్సి ఉంది. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ సెమీ ఫైనల్ కొద్దిసేపటి కిందటే ముగిసింది. ఇందులో బజరంగి 5-12 స్కోరు తేడాతో తన ప్రత్యర్థి చేతిలో పరాజయాన్ని చవి చూశాడు. అజర్‌ బైజాన్‌ కు చెందిన హాజీ అలియేవ్‌ చేతిలో ఓడిపోయాడు. సెమీ ఫైనల్స్‌ లో గెలిస్తే.. భారత్‌కు రజతం, ఫైనల్స్‌ లో ప్రతాపాన్ని చూపితే పసిడి పతకం సొంతమౌతుంది. అలాంటి కీలక మ్యాచ్‌ లో బజరంగి, చివరి వరకూ పోరాడాడు. సెమీస్ గండాన్ని గట్టెక్కడానికి ఎక్కడా లేని తెగువను ప్రదర్శించాడు. అయినప్పటికీ, ఓటమి నుంచి తప్పించుకోలేకపోయాడతను.

ఒలింపిక్స్‌లో భార‌త హాకీ అమ్మాయిలు  అద్భుతంగా పోరాడారు. అస‌లు ఆశ‌లే లేని స్థితి నుంచి ఏకంగా బ్రాంజ్ మెడ‌ల్ ఆడే స్థాయికి చేరారు. మెడ‌ల్ మ్యాచ్‌లోనూ బ్రిట‌న్‌పై చాలా వ‌ర‌కూ పైచేయి సాధించింది. ఒక ద‌శ‌లో 0-2 గోల్స్‌తో వెనుక‌బ‌డినా.. త‌ర్వాత 3-2 లీడ్‌ లోకి దూసుకెళ్లి మెడ‌ల్ సాధించేలానే క‌నిపించారు. కానీ చివ‌రి క్వార్ట‌ర్‌ లో త‌డ‌బ‌డి తృటిలో మెడ‌ల్ చేజార్చుకున్నారు. త‌మ క‌ల చెద‌ర‌డంతో ఈ ఓట‌మిని వాళ్లు జీర్ణించుకోలేక‌ పోయారు. దుఃఖాన్ని ఆపుకోలేక గ్రౌండ్‌లోనే బోరున ఏడ్చేశారు. వాళ్ల‌ను టీమ్ కోచ్‌తోపాటు ప్రత్య‌ర్థి బ్రిట‌న్ ప్లేయ‌ర్స్ కూడా ఓదార్చే ప్ర‌య‌త్నం చేశారు.  ఏదేమైనా పతకం చేజారినా, అద్భుత ప్రదర్శనతో మనసులు గెల్చుకున్న మన అమ్మాయిలు.. బంగారు తల్లులే, భవిష్యత్‌ తరానికి స్ఫూర్తిదాతలే.ఓకే ఒక్క గోల్ తేడాతో చరిత్ర సృష్టించే అవకాశాన్ని పోగొట్టుకుని, విషాదంలో మునిగి ఉన్న భారత మహిళా హాకీ జట్టు ప్లేయర్లు, కోచ్‌ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. వారితో మాట్లాడారు. యువతకు స్ఫూర్తినిచ్చేలా పోరాడారని ప్రశంసల వర్షాన్ని కురిపించారు.

ఆటగాళ్ల ప్రతిభను గెలుపోటములు నిర్ధారించలేవని ఊరడించారు. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ లో భారత పతాకాన్ని ఎగురవేసేలా చేశారని, భారత పోరాట స్ఫూర్తి ఎలాంటిదో ప్రపంచ దేశాలకు తెలియజేశారంటూ కితాబిచ్చారు. సెమీ ఫైనల్స్‌లో భారత్ ఆడిన విధానం, కోట్లాది మంది దేశ ప్రజలకు ప్రేరణను ఇచ్చిందని చెప్పారు. ప్లేయర్లు.. కోచ్‌.. సపోర్టింగ్ స్టాఫ్ ఇలా ప్రతి ఒక్కరినీ తాను పేరుపేరునా అభినందిస్తున్నానని ప్రధాని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందొద్దని, ధైర్యాన్ని కోల్పోవద్దని అన్నారు. ప్లేయర్ నవ్‌ నీత్ కంటికి గాయం కావడం పట్ల ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కంటికి ఏమైందని ప్రశ్నించగా.. మ్యాచ్ సందర్భంగా గాయమైందని, నాలుగు కుట్లు పడ్డాయని టీమ్ కేప్టెన్ రాణి రాంపాల్ వివరించారు. దీనిపై బాప్ రె అంటూ ప్రధానిి ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె కంటికి గాయం కాలేదు కదా, అని అడిగారు. సలీమా టెటె, వందన కఠారియా పేర్లను మోడీ ప్రత్యేకంగా అడుగుతూ మాట్లాడారు. .

ఇకపొతే ఈ ఒలంపిక్స్ లో పతకాలు తెస్తారనుకున్నా షూటర్లు, ఆర్చర్లు చేతులెత్తేయగా.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పరుషుల, మహిళల హాకీ టీమ్స్ సంచలనాలు సృష్టించాయి. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మన్‌ ప్రీత్ సేన కాంస్యంతో కమాల్ చేయగా, మెడల్ గెలవకపోయినా అమ్మాయిలు విశ్వక్రీడల చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌ కు చేరారు. తాజాగా ఎవరూ ఊహించని క్రీడలో భారత్‌ కు మరో పతకం వచ్చేలా కనిపిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే.. అదృష్టం కలిసొస్తే ఒలింపిక్స్‌ గోల్ఫ్‌ లో రజతం లేదా కాంస్యం ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారత యువ గోల్ఫర్ అదితి అశోక్‌ టోక్యోలో అదరగొడుతోంది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో మూడో రౌండ్‌ ముగిసే సరికి అదితి రెండో స్థానంలో నిలిచింది. కీలకమైన నాలుగో రౌండ్‌ శనివారం జరగనుంది. ప్రస్తుతం టోక్యో వాతావరణం మారుతోంది. కొన్ని చోట్ల విపరీతంగా ఎండ కాస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ గాలి ఉద్ధృతంగా వీస్తూ.. వర్షం కురిస్తే మూడో రౌండ్‌ వరకే ఫలితాలను లెక్కలోకి తీసుకుంటారు. అలా జరిగితే భారత్ గోల్ఫర్ అదితికి సిల్వర్ మెడల్ దక్కినట్లే. ప్రస్తుతం అమెరికా అమ్మాయి కొర్దా నెల్లీ 198 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. గోల్ఫ్‌లో ఎవరికి తక్కువ స్కోరుంటే వారే విజేతగా ఆవిర్భవిస్తారు. అదితి 201 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తొలిరౌండ్లో 67, రెండో రౌండ్లో 66, మూడో రౌండ్లో 68 పాయింట్లు సాధించింది. ఇక అదితి అశోక్ 18 ఏళ్ల వయసులోనే 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. తద్వారా ఒలింపిక్స్ బరిలో దిగిన అతి పిన్న గోల్ఫర్‌ గా రికార్డుకెక్కింది.

రెజ్లింగ్‌ మహిళల 50 కిలోల విభాగంలో భారత్‌కు నిరాశే ఎదురైంది. సారా హమీద్‌ చేతిలో భారత మహిళా రెజ్లర్‌ సీమీ బిస్లా ఓటమి పాలైంది.  పురుషుల 50 కి.మీ నడకలో భారత్‌ కు నిరాశ. 50 కి.మీ నడకను గురుప్రీత్‌ సింగ్‌ పూర్తి చేయలేకపోయాడు.
Tags:    

Similar News