టోక్యో ఒలింపిక్స్ : భారత్ కి రెండో పథకం ఖరారు !

Update: 2021-07-30 06:50 GMT
టోక్యో ఒలింపిక్స్‌ లో భారతదేశం కు మరో పతకం ఖాయమైంది. అసోంకు చెందిన యువ బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ సెమీస్‌ కు దూసుకెళ్లింది. క్వార్టర్‌ ఫైనల్‌ లో భాగంగా కొద్దిసేపటి క్రితం చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ నీన్ చిన్‌ పై 4-1తో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆమెకు పతకం ఖాయమైంది. స్వర్ణానికి రెండు బౌట్ల దూరంలో నిలిచిన లవ్లీనా ఓడినా కాంస్యపతకం గ్యారెంటీ.

ఒలింపిక్స్‌ లో పతకం తెస్తుందని అందరూ ఆశలు పెట్టుకున్న స్టార్ బాక్సర్ మేరీకోమ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌ లోనే ఓడిపోయింది. దీనితో భారతీయుల ఆశలు అడియాశలయ్యాయి. 24 గంటలు తిరగక ముందే నేనున్నానంటూ 23 ఏళ్ల అస్సామ్ అమ్మాయి నిరూపించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌ లో లవ్లీనా బోర్గెహెన్ చైనీస్ తైపీకి చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ నీన్ చిన్‌ పై 4-1 తేడాతో విజయం సాధించి పతకం ఖాయం చేసుకున్నది. ఒక వేళ సెమీస్‌ లో గెలిస్తే కాంస్యానికి మించిన పతకమే దక్కుతుంది. లవ్లీనా ఒలింపిక్స్‌ లో పాల్గొనడం ఇదే తొలి సారి కావడం గమనార్హం.

ఒలింపిక్స్‌ లో భారత్‌ కు పతకాలు అందిస్తున్న మూడో బాక్సర్‌ గా లవ్లీనా చరిత్ర సష్టించనున్నది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌ లో విజేందర్ సింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌ లో మేరీ కోమ్ కాంస్య పతకాలు గెలిచారు. ఆ తర్వాత బాక్సర్ లవ్లీనా మాత్రమే. ఇక ఒలింపిక్స్‌ లో 69 కేజీల విభాగంలో పతకం తేనున్న మొదటి బాక్సర్‌ గా రికార్డు సృష్టించనున్నది. గతంలో ప్రపంచ చాంపియన్‌ షిప్‌ లో రెండు సార్లు కాంస్యం అందించిన లవ్లీనా.. ఇప్పుడు దేశానికి ఒలింపిక్ పతకం అందించనున్నది. అగస్టు 4న లవ్లీనా టర్కీకి చెందిన బుసెనాజ్ సుర్మెనిల్‌ తో తలపడనున్నది.

ఇక బాక్సింగ్ లాంటి ఈవెంట్లో సెమీఫైనల్ కి చేరితే మెడల్ ఖాయంగా చెప్పుకోవచ్చు. బాక్సింగ్‌లో రెండు కాంస్య పతకాలను ఇస్తారు. రెండు సెమీఫైనల్స్ లో తలపడ్డ నలుగురు బాక్సర్లలో ఇద్దరు ఫైనల్స్ కి అర్హత సాధించి గోల్డ్, సిల్వర్ మెడల్స్ ని దక్కించుకుంటారు. ఇక సెమిస్ లో ఓటమి చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కాంస్యపతకాలను అందిస్తారు. అందుకే బాక్సింగ్ లో సెమిస్ చేరితే పతకం గ్యారంటీ లవ్లీనా రెండో పతకం తేవడం ఖాయం అవడంతో ఆమెను పలువరు ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తదితరులు అభినందించారు.

కాగా, లవ్లీనా ఇద్దరు అక్కలైన కవలలు లిచా, లిమా కూడా బాక్సర్లే కావడం విశేషం. 2017లో ఆసియన్ చాంపియన్‌షిప్, 2018లో జరిగిన ఇండియన్ ఓపెన్‌లో స్వర్ణం గెలుచుకోవడంతో లవ్లీనా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. 2020లో ఆసియా అండ్ ఓసియానా బాక్సింగ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నీలో విజయం సాధించడం ద్వారా ఒలింపిక్స్ బెర్త్ సంపాదించుకుంది.


Tags:    

Similar News