లాఠీతో ఇరగొట్టారు.. అతనెవరో తెలిశాక.. షాక్ తిన్నారు

Update: 2020-03-28 05:50 GMT
బుద్ధిబలంతో పని చేయాల్సిన వేళ.. కండబలంతో.. అందునా కర్కశ లాఠీతో పని చేస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పాలి. కరోనా వేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను విధిస్తూ ప్రధాని మోడీ నిర్ణయాన్ని తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకున్న తీవ్ర చర్యల్లో ఒకటైన లాక్ డౌన్ వేళ.. పలువురు ప్రజలు రోడ్ల మీదకు రావటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అవసరం ఉన్నా లేకున్నా ఇళ్లల్లో ఉండకుండా బయటకు వస్తున్న తీరుపై పోలీసులు అవగాహన కలిగించే కన్నా.. చేతిలో ఉన్న లాఠీకి శానిటైజర్ పూసి మరీ ప్రయోగిస్తున్నారు.

తమ మాటల కంటే లాఠీలే ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయన్నది వారి ఆలోచన కావొచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా టోలీచౌకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని పట్టుకున్న పోలీసులు.. ఇష్టం వచ్చినట్లు బాదేశారు. అతను చెబుతున్న మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. ఇష్టారాజ్యంగా కొట్టేసిన తర్వాత.. అతను ఎవరో వారికి అర్థమై తెల్లముఖం వేసిన పరిస్థితి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటూ మానవహక్కుల వేదిక ఉపాధ్యక్షుడు సయ్యద్ బిలాల్.

ప్రతిరోజూ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మెటర్నిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఉచితంగా భోజనం అందిస్తుంటాడు. ఆయన సేవా కార్యక్రమాలకు దన్నుగా ఉండేందుకు ఒక వ్యక్తి ఆర్థిక సాయాన్ని అందజేస్తానని చెబితే.. బయటకు వచ్చాడు. మార్గమధ్యంలో అతన్ని ఆపిన పోలీసులు.. చెప్పే విషయాల్ని వినకుండా లాఠీతో చితక్కొట్టేశారు. ఈ ఉదంతంపై మానవహక్కుల సంఘం వేదిక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జరిగిన దానిని పట్టించుకోవద్దని.. కావాలని చేయలేదనని.. తాము ఎంత చెప్పినా వినకుండా బయటకు వస్తున్న వారిని కంట్రోల్ చేసే క్రమంలో ఇలాంటివి జరిగినట్లుగా పోలీసులు చెబుతూ.. చేతులు పట్టేసుకునే పరిస్థితి.
Tags:    

Similar News