డ్రగ్స్ కేసు: టాలీవుడ్ మెడకు చుట్టుకుంటుందా..?

Update: 2022-02-15 07:01 GMT
టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో గత నాలుగున్నరేళ్లుగా విచారణ జరుగుతున్నా.. ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిట్ మరియు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సంస్థలు ఈ కేసులో విచారణ చేసారు. కానీ ఇంతవరకు ఎలాంటి ఆధారాలు దొరికినట్టు లేదు. ఇంతవరకు ఒక్క సినీ సెలబ్రిటీ కూడా ఈ కేసులో అరెస్ట్ కాలేదు కాబట్టి సరైన ఆధారాలు దొరకలేదనే అనుకోవాలి.

2017లో తెలంగాణా ఆబ్కారీ పోలీసులు కెల్విన్ మార్కెరాన్స్ అనే డ్రగ్ సప్లయిర్ ని అరెస్ట్ చేయడంతో టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. ప్రధాన నిందితుడు కెల్విన్ అందించిన సమాచారం మేరకు ఎక్సైజ్ శాఖ ఏర్పాటు చేసిన సిట్.. పలువురు సినీ ప్రముఖులను ఎంక్వైరీ చేసింది. వీరి నుంచి గోళ్లు మరియు తల వెంట్రుకలు - రక్త నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. అయితే అందులో డ్రగ్స్ ఆనవాళ్లు లేకపోవడంతో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

కానీ ఈ కేసుకు అక్కడితో ఫుల్ స్టాప్ పడలేదు. డ్రగ్స్ క్రయ విక్రయాల్లో ఫెమా మరియు మనీ లాండరింగ్ కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేసి విచారించారు. కెల్విన్ తో ఉన్న సంబంధాలపై ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీసింది. ఈ కేసులో నిందితులు మరియు సాక్షుల వాంగ్మూలాలు - ఫోన్ కాల్ డేటా ఇవ్వాలని ఈడీ అధికారులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ను కోరారు. అయితే ఇంతవరకు ఈడీ రాసిన లేఖకు సమాధానం రాలేదు.

ఎక్సైజ్ శాఖ కేసు వివరాలు ఇవ్వడం లేదని హైకోర్ట్‌ కు ఈడీ వెళ్లడంతో.. ఈ కేసుకి సంబంధించి రికార్డులన్నీ ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ ఇంతవరకు ఆ డాకుమెంట్స్ ఈడీ చేతికి రాలేదని సమాచారం. ఒకవేళ రికార్డులన్నీ ఈడీకి చేరితే.. మరోసారి ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు - డ్రగ్స్ వినియోగం - క్రయ విక్రయాలలో సినీ ప్రముఖుల పాత్ర వంటివి బయట పడే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే టాలీవుడ్ మెడకు ఉచ్చు బిగిసినట్లే.

ఇదిలా ఉంటే డ్రగ్స్ వ్యవహారంలో చట్టంలోని లొసుగుల్ని ఉపయోగించుకుని సినీ ప్రముఖులు అరెస్టుల నుంచి తప్పించుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ వినియోగదారుల్ని బాధితులుగా గుర్తిస్తూ వారికి విచారణ నుంచి మినహాయింపునిచ్చే మాదక ద్రవ్యాల నిరోధక చట్టం లోని సెక్షన్ 64-ఎ ప్రకారం ఈ కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని టాక్ నడుస్తోంది.

డ్రగ్స్ కు బానిసైన తర్వాత ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స తీసుకున్నామని సర్టిఫికెట్ చూపిస్తే కేసు విచారణ నుంచి బయటపడే అవకాశం ఉందట. ఈ విధంగానే కేసుతో సంబంధం ఉన్నవారు విచారణ నుంచి మినహాయింపు పొందారని అనుకుంటున్నారు. ఇదే నిజమైతే ఇప్పుడు ఈడీ అవన్నీ బయటకు తీస్తుందో లేదో చూడాలి.
   
Tags:    

Similar News