మ‌ద‌ర్స్ డే: క‌రోనా వేళ రియ‌ల్ హీరో!

Update: 2021-05-09 09:30 GMT
వయస్సుతో సంబంధం లేదు. ఆ మ‌మ‌త‌కు కొల‌మానం లేదు. ఆ ప్రేమ‌ను తూచే త‌క్కెడా లేదు! అదే.. ఆ అపురూప ప్రేమ‌కు నిలువెత్తు రూప‌మే అమ్మ‌!! మ‌న‌ జీవితం ప్రారంభ‌మైన నాటి నుంచి ఆ జీవితంలోకి, మన మనసులోకి వచ్చిన మొదటి వ్యక్తి అమ్మే! ఆమె ప్రేమ మ‌న ర‌క్తంలో ర‌క్త‌మై.. అంత‌ర్లీనంగా ప్ర‌వ‌హిస్తూ నే ఉంటుంది.  ఎందుకంటే ఆమె మ‌న‌ల్ని ఎప్పుడూ.. నిర్దేశించ‌దు క‌నుక‌.. ఆమె ఎప్ప‌టికి మ‌న‌కు ప్ర‌తిబం ధకం కాదు కనుక‌! ఈ రోజు ఆ అమ్మ‌కు మ‌న‌సులోనే కోవెల క‌ట్టి  సంబరం చేసుకునే రోజు. ఒక ప్ర‌త్యేక‌మైన రోజు. ప్రపంచం మొత్తం  మే 9, 2021 న మదర్స్ డేను జరుపుకుంటోంది. అమ్మ అనే ప‌దాన్ని మించిన ప‌దం.. దీనికి స‌రిస‌మానమైన ప‌దం ఈ ప్ర‌పంచంలోనే లేదు. అందుకే క‌ర్మ భూమి అయిన మ‌న దేశంలో `మాతృదేవో భ‌వ‌!` అంటూ అమ్మ‌కు పెద్ద‌పీట వేశాయి.. మ‌న శాస్త్రాలు.

`అమ్మ` అనే రెండు అక్ష‌రాల‌ను వ‌ర్ణించేందుకు, ఆమె చేసే త్యాగాల‌ను వివ‌రించేందుకు ఈ ప్ర‌పంచంలోని ఏ డిక్ష‌న‌రీలో ఉన్న ప‌దాలూ స‌రిపోవంటే అతిశ‌యోక్తికాదు! పిల్లల భ‌ద్ర‌త‌తోపాటు, వారి జీవితాన్ని తీర్చిదిద్దేందుకు అమ్మ చేసే త్యాగం మ‌రో వ్య‌క్తి ఎవ‌రూ.. చేయ‌లేరంటే.. కూడా అతిశ‌యోక్తి కాదు. ప్ర‌స్తుతం కరోనావైరస్ మహమ్మారి ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్న సమయంలో, మనకు వైద్యులు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్ లైనర్లుగా పనిచేస్తున్న అసంఖ్యాక తల్లులు కంటికి రెప్ప‌లుగా కాచుకుంటున్నారు. క‌డుపున పుట్టిన వారి పిల్లలను సైతం ఇంటికే ప‌రిమితం చేసి.. క‌రోనా బాధితుల్లోనే త‌మ పిల్ల‌ల‌ను చూసుకుంటూ.. సేవ‌లందిస్తున్న అమ్మ‌ల‌కు ఈ రోజు ప్ర‌తి ఒక్క‌రూ హ్యాట్సాఫ్ చెప్ప‌డం ముదావ‌హం.

క‌రోనా విధుల్లో ఉన్న అనేక రంగాల‌కు చెందిన త‌ల్లులు.. ఇంటి వ‌ద్ద విడిచి పెట్టిన తమ పిల్లలు ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో.. అనే ఆందోళ‌న మ‌న‌సును మెలిపెడుతున్నా.. తమ విధుల్లో నిరంత‌రం నిమ‌గ్న‌మై.. బాధితుల‌కు సాంత్వ‌న చేకూర్చేందుకు అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్న‌తీరు న‌భూతో.. న‌భ‌విష్య‌తి అన్న విధంగా ఉంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఏ అమ్మ అయినా.. త‌న పిల్ల‌ల గురించి నిరంతరం ఆలోచిస్తుంది. నిరంత‌రం వారి గురించే ఆత్రుతగా ఉంటుంది. అయినప్పటికీ, ఆమె మహమ్మారి సోకిన వారికి సేవ చేయడానికి మించిన సేవ లేద‌ని భావిస్తున్న తీరు.. ఎంద‌రికో ఆద‌ర్శం. అంతేకాదు.. ఆసుప‌త్రుల్లోనూ స‌మాజంలో నూ వివిధ రూపాల్లో సేవ‌లందిస్తున్న త‌ల్లులు.. ఇంటికి చేరుకున్నాక‌.. త‌మ పిల్ల‌ల‌ను ప్రేమ‌గా ద‌క్క‌ర‌కు తీసుకునే ప‌రిస్థితిలేదు. వారికి ఈ క‌రోనా ఎక్క‌డ సోకుతుందోన‌న్న ఆవేద‌న వారిల క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. సామాజిక సేవ‌నే ప‌ర‌మార్థంగా భావిస్తున్నారు.

ప్ర‌స్తుతం క‌ర‌నో స‌మ‌యంలో బాధితుల‌కు సేవ‌లందిస్తున్న అమ్మ‌లు రెండు ర‌కాలుగా ఆవేద‌న చెందుతున్నారు. ఒక‌వైపు క‌రోనా త‌మ‌కు ఎక్క‌డ సోకుతుందోన‌న్న ఆవేద‌న‌. మ‌రోవైపు ఇంటి వ‌ద్ద త‌మ‌కోసం ఎదురు చూస్తున్న చిన్నారులు నిరంత‌రం గుర్తుకు వ‌స్తుంటే.. వారికి దూర‌మ‌య్యామ‌న్న బాధ వారిని నిలువునా.. క‌న్నీరు పెట్టించేలా చేస్తోంది. ఒక మాతృమూర్తిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే.. మ‌రోవైపు.. క‌రోనా బాధితుల‌కు సేవ చేయ‌డంలో నిమ‌గ్న‌మ‌వ‌డం అనేది క‌త్తిమీద సాము లాంటిదే. అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్స్‌, న‌ర్సులు, పోలీసులు.. ఇలా అనేక రంగాల్లో ఉన్న త‌ల్లులు నేడు క‌రోనా స‌మ‌యంలో నిరంత‌రం సేవ‌లు అందిస్తున్నారు. దీంతో వారి క‌న్న‌బిడ్డ‌ల‌కు వారు దూర‌మ‌వుతున్నార‌నేది నిర్వివాదాంశం.
 
క‌రోనా తొలిద‌శ‌లో.. దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌జార‌వాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో తెలంగాణ‌లోని 50 ఏళ్ల వ‌య‌సున్న ఓ మాతృమూర్తి.. త‌న కుమారుడిని సుర‌క్షిత ప్రాంతానికి చేర్చేందుకు.. 1400 కిలోమీట‌ర్లు.. వాహ‌నాన్ని న‌డుపుకొంటూ.. నిజామాబాద్ నుంచి టూవీల‌ర్‌పై నెల్లూరులోని సుర‌క్షిత ప్రాంతానికి చేర్చిన విష‌యం ప్ర‌స్తావ‌నార్హం. ఈ సాహ‌సం వెనుక ఆమెలో ఉన్నందంతా అమ్మ ప్రేమే త‌ప్ప మ‌రొక‌టి లేదు.

ఇక‌, ఇప్పుడు క‌రోనా సెకండ్ వేవ్‌లో ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఓ మ‌హిళా డీఎస్పీ తాను.. నిండు గ‌ర్భిణి అయి ఉండి కూడా క‌రోనా విధుల్లో పాల్గొన‌డం తెలిసిందే. ప్ర‌జ‌ల‌ను క‌రోనాపై నిరంత‌రం అప్ర‌మ‌త్తం చేస్తూ.. లాక్‌డౌన్ గైడ్‌లైన్స్ అమ‌ల‌య్యేలా వీధుల్లో ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల‌కు భ‌ద్ర‌త క‌ల్పించారు. అంతేకాదు. ఒక‌వైపు వేస‌వి తీవ్రత ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ.. తాను నిండు గ‌ర్భిణీ అయిన‌ప్ప‌టికీ.. డీఎస్పీ.. శిల్పా సాహు.. చేతిలో లాఠీ ప‌ట్టుకుని.. దంతెవాడ‌లోని జ‌న‌స‌మ్మ‌ర్థ ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న‌క‌ల్పించ‌డం.. అమ్మ‌లోని నిస్వార్థ సేవ‌కు నిద‌ర్శ‌నం.

క‌రోనా సెకండ్ వేవ్‌లో గర్భిణీ స్త్రీలు వైరస్ బారిన పడిన సందర్భాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఇలాంటి మ‌హిళ‌లు సైతం ప్ర‌జాసేవ‌లో త‌మ జీవితాల‌ను త్యాగం చేస్తున్న తీరు వారి అంకిత భావాన్ని చాటుతాయ‌న‌డంలో సందేహం లేదు. ఇక‌, ఈ ఏడాది వ‌చ్చిన‌.. మ‌ద‌ర్స్‌డే మ‌రింత ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. ఎందుకంటే.. దేశ‌వ్యాప్తంగా అనేక మంది అమ్మ‌లను ఈ మ‌హ‌మ్మారి త‌న పొట్ట‌న పెట్టుకుంది. దీంతో వంద‌ల సంఖ్య‌లో అమ్మ‌ల‌ను కోల్పోయిన వారు మ‌న క‌ళ్ల‌ముందే క‌నిపిస్తున్నారు.

ఈ మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా క‌రోనా విల‌యానికి ప్రాణ త్యాగం చేసిన అమ్మ‌ల‌తోపాటు.. నిరంత‌రం ప్ర‌జ‌ల కోసం పాటు ప‌డుతున్న వివిధ రంగాల‌కు చెందిన మ‌హిళ‌ల‌కు హ్యాట్సాప్ చెప్ప‌డం ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త‌.  ప్ర‌తి ఒక్క‌రికీ.. హ్యాపీ మ‌ద‌ర్స్ డే..!
Tags:    

Similar News