తిరుపతి మొగ్గు ఎటువైపు?

Update: 2021-04-16 10:49 GMT
తిరుపతి ఉప ఎన్నికలకు వేళైంది. రేపే లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ జరుగనుంది. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం ఇప్పుడు వైసీపీకి అడ్డాగా మారింది. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీనే గెలుపొందింది.

అయితే వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ మరణంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మీ, బీజేపీ నుంచి రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి చింతా మోహన్ తదితరులు బరిలో నిలిచారు.ఈ ఎన్నికల్లో వైసీపీ గెలుపు సునాయాసంగానే కనిపిస్తోంది. మెజార్టీని ప్రతిపక్షాలు ఎంత తగ్గిస్తాయన్నదే కీలకం అని సర్వేలు చెబుతున్నాయి.

తిరుపతి ఎంపీ  సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. చిత్తూరు జిల్లాలో మూడు, నెల్లురులో నాలుగు నియోజకవర్గాలున్నాయి. ఎస్సీ రిజర్వుడ్ అయిన ఈ సీటులో  2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి దుర్గాప్రసాద్ తన సమీప టీడీపీ నాయకురాలు పనబాక లక్ష్మీపై 2,28,576 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఒక్క తిరుపతిలో మాత్రమే టీడీపీకి ఆధిక్యం లభించగా మిగతా ఆరు చోట్ల వైసీపీకే మెజార్టీ వచ్చింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే గెలవడం విశేషం. తిరుపతిలోనూ వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గెలిచాడు.

ఇక బీజేపీ తరుఫున 2019 లోక్ సభ ఎన్నికల్లో తిరుపతి నుంచి బొమ్మి శ్రీహరిరావు పోటీచేశారు. ఆయనకు మొత్తం 16125 ఓట్లు మాత్రమే లభించాయి. జనసేన బలపరిచిన బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ దగ్గుబాటి శ్రీహరిరావుకు 20971 ఓట్లు రావడం విశేషం. ఇప్పుడు బీజేపీ-జనసేన కలిసిపోవడంతో సరాసరి 35 వేల ఓట్లు వీరివి ఉన్నట్టు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనల కంటే కాంగ్రెస్ పార్టీ, నోటా ఎక్కువ ఓట్లు సాధించడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కు 24039 ఓట్లు, నోటాకు ఏకంగా వీరిందరికంటే ఎక్కువగా 25781 ఓట్లు వచ్చాయి.

ఈసారి పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. పోయిన సారి తగ్గిన తిరుపతిలోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. దీంతో భారీ మెజార్టీతో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గెలవడం పక్కాగా కనిపిస్తోంది. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ పట్టుదలగా ప్రచారం చేస్తుండడంతో మొగ్గు అటువైపే కాస్త కనపడుతోంది. పైగా అధికారంలో వైసీపీ ఉండడంతో ఉప ఎన్నికల్లో సాధారణంగా ఆ పార్టీకే ప్రజలు పట్టం కట్టడం ఆనవాయితీగా వస్తోంది. మరికొన్ని రోజుల్లో ఫలితాల్లో ఇది ఏ మేరకు ప్రస్ఫుటిస్తుందన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News