టాన్నుల కొద్దీ సానుభూతి... మేము భరించలేం బాబోయ్!

Update: 2022-11-10 12:30 GMT
సానుభూతి మార్కెట్ లో దొరుకుతుందా. దొరకదు కాబట్టే అది చాలా  ఈజీ అయిపోయింది. ముఖ్యంగా రాజకీయ జీవులకు అది చక్కని ఆయుధం. ఏదైనా ఘటన జరుగుతూంటే అక్కడ ఎవరికైనా  ఇబ్బందులు వస్తే కనుక రాజకీయ పార్టీలు రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతాయి. దాంతో పాటు తమతో మోసుకొచ్చిన టన్నుల కొద్దీ సానుభూతిని కురిపిస్తూ ఏడారిలో కూడా సింపతీ వానలు కురిపించేస్తాయి.

ప్రస్తుతం ఏపీలో ఇప్పటం అనే గ్రామం పరిస్థితి అలాగే తయారైంది. ఇప్పటం గ్రామం చుట్టూ ఏపీ రాజకీయం ఇపుడు తిరుగుతోంది. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన పార్టీ మీటింగ్ పెట్టారో తెలియదు కానీ నాటి నుంచి ఇప్పటం టాక్ ఆఫ్ ది టౌన్  అయిపోయింది. ఇప్పటం విషయంలో అభివృద్ధి చేస్తామని వైసీపీ చెబుతోంది. దానికి రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని తీసుకుంది.

అయితే ఆ వంక చెప్పి తమ మద్దతుదారుల  ఇళ్ళను కూలగొడుతున్నారంటూ జనసేన ఇప్పటికే మండిపడుతోంది. ఇప్పటంలో తమ సభకు భూమి ఇచ్చారు కాబట్టే వైసీపీ పెద్దలు కక్షకట్టారని కూడా ఆరోపిస్తోంది. దాంతో ఇప్పటానికి పవన్ కళ్యాణ్ వెళ్లడం అక్కడ ఆయన మార్క్ ఫైర్ ని చూపించడం జరిగిపోయాయి. ఇపుడు చినబాబు వంతు అన్నట్లుగా లోకేష్ కూడా ఇప్పటానికి చేరుకుని జనాలను పరామర్శించారు.

అయితే లోకేష్ రాక సందర్భంగా అక్కడ ఇళ్ల మీద వెలసిన కొన్ని ఫ్లెక్సీలు ఆసక్తికరంగా ఉన్నాయి. మా ఇళ్లను ఎవరూ కూల్చలేదు. మాకు మీ సానుభూతి వద్దే వద్దు అంటూ కట్టిన ఫ్లెక్సీలు ఇప్పటంలో కనిపిస్తున్నాయి. పైగా డబ్బులిచ్చి అబద్ధాలను నిజాలు చేయాలనుకుంటున్నారు అంటూ కామెంట్స్ కూడా అందులో రాశారు. దీంతో ఇది మరో కొత్త రాజకీయానికి దారితీస్తోంది.

ఈ రకంగా ఫ్లెక్సీలు కట్టిన వారిని వైసీపీ సానుభూతిపరులుగా టీడీపీ జనసేన లెక్కలేస్తున్నాయి. ఇప్పటం లో ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టిన ఇళ్ళు కేవలం పది శాతం మాత్రమే ఉన్నాయని, దాంతో మిగిలిన తొంబై శాతం ప్రజలూ ఇబ్బందుల్లో ఉన్నట్లే కదా అంటూ నారా లోకేష్ లాజిక్ పాయింట్ తీశారు. ఇప్పటం ప్రజలను తాము ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.

అదే విధంగా అభివృద్ధికి తాము వ్యతిరకం కాదని, అయితే స్థానిక ప్రజలను ఒప్పించి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు మరో వైపు పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఇప్పటంలో పర్యటించి వచ్చారు. ఆయన ఇపుడు ఇళ్ళు కూల్చారంటున్న బాధితులకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయలు వంతున ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. తొందరలో ఆయన ఇప్పటం టూర్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఇప్పటం అంటేనే చాలా గజిబిజి రాజకీయంగా మారింది.

ఇళ్ళు కూల్చలేదు అని కొందరు అంటున్నారు. మావన్నీ కూల్చేశారు అని పోలోమంటూ రాజకీయ నేతలు వచ్చినపుడు మరికొందరు వస్తున్నారు. అసలు ఇప్పటంలో ఏం జరుగుతోంది అన్నది ఎవరికీ అర్ధం కావడం లేదు అంటున్నారు. నిజానికి ఇప్పటం ఏపీలో రాజకీయ వేడిని మరింతగా రగిల్చే రాజకీయ ప్రయోగశాలగా మారిందా మార్చుకుంటున్నారా అన్నదే తేలాల్సిన విషయం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News