ఆసియాలోనే అదరగొట్టేస్తున్న మన కుబేరులు.. చైనా సైతం వెనక్కి

Update: 2021-06-14 08:30 GMT
గడిచిన కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్ దూసుకెళుతోంది. మధ్య మధ్యలో క్రాష్ అవుతున్నా.. రికవరీ చాలా వేగంగా సాగుతోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ మాంచి జోరు మీద ఉన్న విషయం తెలిసిందే. రానున్నరోజుల్లో ఇది మరింత ముందుకు వెళ్లటమే తప్పించి..వెనకడుగు వేసే అవకాశం లేదంటున్నారు. కరోనా నేపథ్యంలోచోటు చేసుకున్న పరిణామాలు.. మారిన జీవనశైలితో పాటు.. బ్యాంకుల్లో పొదుపు చేసే మొత్తాలకు వచ్చే వడ్డీ తక్కువగా ఉండిపోవటం.. ఇంటి నుంచి పని చేసే విధానాలు స్టాక్ మార్కెట్ ను మరింత జోరుగా ముందుకు తీసుకెళుతున్నాయి.

గతంలో విదేశీ మదుపుదారుల ప్రభావం స్టాక్ మార్కెట్ మీద ఉండేది. ఇప్పుడు సీన్ అందుకు భిన్నంగా ఉందంటున్నారు. గడిచిన కొన్ని నెలల వ్యవధిలో స్టాక్ మార్కెట్ లోకి ఎంట్రీఅయిన వారు కోట్లాది మంది ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే దేశ ఆర్థిక పరిస్థితి మీద ఆందోళన వ్యక్తమవుతున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్ లో మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి వ్యక్తమవుతోంది. దీంతో.. స్టాక్ మార్కెట్ ర్యాలీలో నడుస్తోంది.

దీని ప్రభావంతో దేశీయ కుబేరుల ఆస్తులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ.. ఆదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీల ఆస్తులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఆసియాలోనే అత్యంత సంపన్నుల స్థానాల్లోకి ఈ ఇద్దరుచేరుకున్నారు. ఇంతకాలం ఆసియా కుబేరులు అన్నంతనే చైనా టెక్ దిగ్గజాలైనజాక్ మా.. జాంగ్ షన్ షాన్ ల పేర్లు వినిపించేవి.

తాజాతా వారిని తోసి మరీ ముందుకు వెళ్లిపోయారు అంబానీ.. అదానీలు. శుక్రవారం నాటికి ముకేశ్ అంబానీ సంపద విలువ రూ.6.13లక్షల కోట్లుగా ఉంటే.. గౌతం అదానీ సంపద రూ.5.62 లక్షల కోట్లుగా ఉంది. ఈ ఏడాది ముకేశ్ అంబానీతో పోలిస్తే.. గౌతమ్ అదానీల సంపద భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 12వ స్థానంలో ఉంటే.. గౌతం అదానీ 14వ స్థానంలో ఉన్నారు. స్టాక్ మార్కెట్ ఇదే ఊపులో ముందుకు వెళితే మాత్రం.. వీరి సంపద తక్కువ వ్యవధిలోనే మరింత ఎక్కువ కావటం ఖాయమని చెప్పాలి.
Tags:    

Similar News