మోడీ బ్యాచ్ కి రోగాల శాపాలు!

Update: 2018-09-18 05:26 GMT
ఏమైందో ఏమో కానీ.. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఒక కేంద్ర స‌ర్కారులో భాగ‌మైన మంత్రులు పెద్ద ఎత్తున అస్వ‌స్థ‌త‌కు గురికావ‌టం.. రోజుల త‌ర‌బ‌డి ఆసుప‌త్రుల్లో ఉండ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ విన్న‌ది లేదు. ఈ లోటును తీరుస్తూ మోడీ స‌ర్కారులో కేంద్ర‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రించిన ప‌లువురు ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు చొప్పున అనారోగ్యానికి గురైన చికిత్స పొందేందుకు విదేశాల‌కు వెళుతున్న వైనం అంత‌కంత‌కూ పెరుగుతోంది.

తాజాగా ఈ జాబితాలో కేంద్ర‌మంత్రి.. పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి హెచ్ ఎన్ అనంత‌కుమార్ అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో.. ఆయ‌న లండ‌న్ లో చికిత్స పొందుతున్నారు. రెండువారాల కింద‌ట ప్ర‌ధాని మోడీని క‌లిసి వ్య‌క్తిగ‌తంగా అనుమ‌తి తీసుకొని మ‌రీ లండ‌న్ కు వెళ్లిన‌ట్లుగా చెబుతున్నారు.

అయితే.. ఆయ‌న అనారోగ్యంతో లండ‌న్ కు వెళ్లార‌న్న వార్త‌ల్లోనిజం లేద‌ని.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు లండ‌న్ లో ఉన్నార‌ని.. ప్ర‌స్తుతం ఆయ‌న వారి బంధువుల ఇంట్లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరినట్లుగా వ‌స్తున్న వార్తల్ని ఆయ‌న కార్యాల‌య సిబ్బంది ఖండిస్తున్నారు.

ఈ మ‌ధ్య‌న జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల సంద‌ర్భంలో తీవ్ర‌మైన ద‌గ్గు స‌మ‌స్య‌ను ఎదుర్కొన్న మంత్రి అనంత‌కుమార్.. ఎన్నిక‌ల త‌ర్వాత చికిత్స చేయించుకోవాల‌ని ప్లాన్ చేసిన‌ట్లుగా చెబుతారు.అయితే.. ఆయ‌న కార్యాల‌య సిబ్బంది మాత్రం ఆయ‌న క్షేమంగా ఉన్న‌ట్లుగా వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. మోడీ ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉండే మంత్రులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అనారోగ్యానికి గురి కావ‌టం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది.

కేంద్ర‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రిస్తున్న సుష్మా.. అరుణ్ జైట్లీలు ఇప్ప‌టికే తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. మాజీ కేంద్ర‌మంత్రి.. గోవా ముఖ్య‌మంత్రి.. మోడీ స‌న్నిహితుడు మ‌నోహ‌ర్ పారీక‌ర్ తీవ్ర‌మైన పాంక్రియాటిక్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న  ఇంకా కోలుకోక ముందే మ‌రోమంత్రి అనారోగ్యానికి గురి కావ‌టం హాట్ టాపిక్ గా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News