పాక్‌ కు పెద్ద‌న్న షాక్‌!

Update: 2016-09-21 11:57 GMT
భార‌త్‌ పైకి ఉగ్ర‌వాదుల‌ను ఉసిగొల్పే కార్య‌క్రమాన్ని నిర్విఘ్నంగా కొన‌సాగిస్తున్న పాకిస్థాన్ కు అగ్ర‌రాజ్యం అమెరికా భారీ షాక్‌నే ఇచ్చింది. అంత‌ర్జాతీయ ఉగ్ర‌వాదానికి వెన్నుద‌న్నుగా నిలుస్తున్న దేశంగా పాకిస్థాన్ ను గుర్తించాలంటూ అగ్ర‌రాజ్య చ‌ట్ట‌స‌భ కాంగ్రెస్ ముందుకు ఈ మేర‌కు ఓ కీల‌క బిల్లు వ‌చ్చింది. అమెరికాలోని కీల‌క రాష్ట్రాలు టెక్సాస్ - కాలిఫోర్నియాల‌కు చెందిన కాంగ్రెస్ స‌భ్యులు ఈ బిల్లును ప్ర‌తిపాదించారు. ఈ బిల్లుకు 90 రోజుల్లో అమెరికా అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా ఆమోదం తెలిపితే... పాక్ కొంప కొల్లేరైట్లే. ఉగ్ర‌వాదాన్ని తుద‌ముట్టించేందుకు ఇప్ప‌టికే పాక్‌ కు అమెరికా భారీ సాయం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

మొన్న ప‌ఠాన్‌ కోట్ ఎయిర్‌ బేస్‌ పై జ‌రిగిన దాడి ద‌రిమిలా ఈ సాయాన్ని పునఃప‌రిశీలించిన అమెరికా పాక్ ప్రయేమాన్ని నిర్ధారించుకుని సాయంలో కోత విధించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా భార‌త్‌ లోని యూరీ ప‌ట్ట‌ణంలో పాక్ భూభాగం నుంచి వ‌చ్చిన‌ట్లుగా భావిస్తున్న న‌లుగురు ఉగ్ర‌వాదులు భీక‌ర దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో 20 మంది భార‌త సైనికులు చ‌నిపోగా... భార‌త సైన్యం జ‌రిపిన ఎదురుదాడిలో న‌లుగురు ఉగ్ర‌వాదులు కూడా హ‌త‌మ‌య్యారు. అయితే ఉగ్రవాదులు వాడిన ఆయుధాలు పాక్ లో త‌యారైన‌వేన‌ని భార‌త్ ఆరోపించింది. ఈ మేర‌కు ప‌క్కా ఆధారాల‌ను కూడా పాక్‌ కు అంద‌జేసింది. అయితే భార‌త్ వాద‌న‌ను పాక్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై అంత‌ర్జాతీయ మీడియా ప‌లు క‌థ‌నాలను ప్ర‌చురించింది. హెచ్ ఆర్ 6069 బిల్లు పేరిట *పాకిస్థాన్ స్టేట్ స్పాన్స‌ర్ ఆఫ్ టెర్ర‌రిజం డిజైనేటెడ్ యాక్ట్‌*ను కాంగ్రెస్ స‌భ్యులు టెడ్ పోయే(టెక్సాస్‌) డానా రోహ్రాబాచ‌ర్ (కాలిఫోర్నియా)లు స‌భ ముందు ప్ర‌తిపాదించారు. దీనిపై ఆ దేశ అధ్య‌క్షుడు 90 రోజుల్లోగా స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. స‌ద‌రు నివేదిక‌లో ఈ బిల్లుకు ఒబామా అనుకూలంగా నివేదిక అందిస్తే... పాక్ కు అమెరికా నుంచి అందుతున్న సాయం నిలిచిపోవ‌డం ఖాయ‌మే.

అంతేకాకుండా కొత్త‌గా పాక్ పై ఆంక్ష‌లు కూడా అమ‌ల‌య్యే ప్ర‌మాదం లేక‌పోలేదు. 90 రోజుల త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉన్నా... ప్ర‌స్తుంత ఐక్య‌రాజ్య‌స‌మితి ముందు ప్ర‌సంగించేందుకు వెళుతున్న పాక్ అధ్య‌క్షుడు న‌వాజ్ షరీఫ్ కు మాత్రం ఈ బిల్లు పెద్ద ఇబ్బందిగానే ప‌రిణ‌మించింది.
Tags:    

Similar News