చంద్రబాబుతో ఇటీవల పవన్‌ చర్చించిన అంశాలు ఇవే!

Update: 2023-01-13 07:30 GMT
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరిగిన జనసేన పార్టీ యువశక్తి సభలో జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు. లక్షలాది మంది హాజరైన సభను ఉద్దేశించి ప్రసంగించిన పవన్‌ మరోమారు హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఇటీవల తాను చంద్రబాబుతో భేటీ అయితే వైసీపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని నిప్పులు చెరిగారు. తనకు బేరాలు కుదిరాయని మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తాను రోజుకు కోటి రూపాయలు సంపాదిస్తున్నానని తెలిపారు. ఏడాదికి తన సంపాదన రూ.250 కోట్లు ఉందన్నారు. ఏటా రూ.25 కోట్లు ఆదాయ పన్ను కడుతున్నానని తెలిపారు. ఇటీవల విశాఖపట్నంలో పోలీసులు తనను నిర్బంధించినప్పుడు చంద్రబాబు వచ్చి సంఘీభావం తెలిపారన్నారు. ఈ క్రమంలో తాను కూడా చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశానని వెల్లడించారు. అయితే సీట్ల గురించి చంద్రబాబు, తన మధ్య ఎలాంటి చర్చ జరగలేదన్నారు.

చంద్రబాబుతో సమావేశంలో.. క్షీణించిన శాంతిభద్రతలు, రాష్ట్ర భవిష్యత్తుపైనే ఎక్కువసేపు చర్చించామని పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రెండున్నర గంటలపాటు చంద్రబాబుతో ఏం మాట్లాడారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని పవన్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు.

చంద్రబాబును తాను కలసినప్పుడు మొదటి పది నిమిషాలు మీరు బాగున్నారా వంటి కుశల ప్రశ్నలతో సరిపోయిందని తెలిపారు. తర్వాత పోలవరం నిర్మాణంలో ఆలస్యం, జలవనరుల శాఖ మంత్రి సంబరాల రాంబాబు పనితీరుపై 23 నిమిషాలు మాట్లాడామని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని 15వ స్థానంలో నిలిపిన ఐటీ శాఖ మంత్రి (గుడివాడ అమర్‌నాథ్‌)పై 18 నిమిషాలు చర్చించామని పవన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, ఏం చేయాలనే విషయమై 38 నిమిషాలు చంద్రబాబు, తాను మాట్లాడుకున్నామని చెప్పారు. తర్వాత మరోసారి టీ తాగామని వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలనే దానిపై చర్చించామన్నారు. అదేవిధంగా వ్యతిరేక ఓటు చీలనివ్వనని చంద్రబాబుకు చెప్పానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను గతంలో తెలుగుదేశం పార్టీని తిట్టానని అంటున్నారని... అయితే మనముందు మరేం మార్గాలున్నాయి? అని పవన్‌ జనసేన శ్రేణులను ప్రశ్నించారు. ఇంట్లో అత్తతోనో, ఎదురింటివారితోనో గొడవ పడితే మాట్లాడటం మానేస్తామా.. సర్దుకుపోవాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News