కొత్త నోటు చిరిగిందా? జేబుకు చిల్లే

Update: 2018-03-22 05:00 GMT
నోటు అన్నాక చిర‌గ‌కుండా ఉంటుందా?   అలా అనుకొని కాస్త చినిగిన నోటు జేబులో పెట్టుకున్నారా?  అయితే.. మీకు భారీ లాస్. చిరిగిన నోటుకు స‌రిప‌డా న‌ష్టం మీ జేబులో ఉన్న‌ట్లే. గ‌తంలో మాదిరి చినిగిన నోట్ల‌ను వెన‌క్కి తీసుకునే విధానంపై ఆర్ బీఐ నుంచి ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు రాక‌పోవ‌టంతో ఇప్పుడు చిత్ర‌మైన వాతావ‌ర‌ణ నెల‌కొంది.

పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసిన త‌ర్వాత కేంద్రం విడుద‌ల చేసిన రూ.2వేలు.. రూ.500.. రూ.200.. రూ.50.. రూ.10తో స‌హా కొత్త‌నోట్లు చిరిగితే తీసుకునేందుకు మార్గ‌ద‌ర్శ‌కాల్ని సిద్ధం చేయాలి. కానీ.. అలాంటివేమీ చేయ‌లేద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

చిరిగిన కొత్త నోట్లు బ్యాంకుల‌కు వ‌స్తే వారేం చేయాల‌న్న దానిపై ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు లేక‌పోవ‌టంతో కొత్త‌గా వ‌చ్చిన నోట్లు చిరిగితే బ్యాంక‌ర్లు వెన‌క్కి తీసుకోవ‌టం లేదు. జ‌నాల ద‌గ్గ‌ర నోట్లు చిరిగితే వారి ఆశ్ర‌ద్ధ‌గా అనుకొని ఊరుకోవ‌చ్చు. కానీ.. బ్యాంకుల్లోనూ.. ఏటీఎంల నుంచి వ‌స్తున్న నోట్ల‌లో కొన్ని చిరిగిన నోట్లు రావ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. దీనిపై బ్యాంక‌ర్లు సానుకూలంగా స్పందించ‌క‌పోవ‌టంతో ఏం చేయాలో దిక్కుతోచ‌ని ప‌రిస్థితుల్లో సామాన్యులు ఉంటున్నారు.

చిరిగిన కొత్త నోట్ల‌ను తీసుకొని బ్యాంకుల‌కు వెళితే రిజెక్ట్ చేస్తున్నారు. స‌ర్లే అని.. హైద‌రాబాద్ లోని  రిజ‌ర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాల‌యానికి తీసుకెళ్లినా వారు వెన‌క్కి తీసుకోవ‌టానికి ఒప్పుకోక‌పోవ‌టం లేదు. ఆర్ బీఐ నుంచి త‌మ‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు రాలేద‌ని.. అవి వ‌చ్చిన త‌ర్వాత వెన‌క్కి తీసుకుంటామ‌ని చెబుతున్నారు. అప్ప‌టివ‌ర‌కూ చిరిగిన నోట్లును త‌మ వ‌ద్ద‌నే ఉంచుకోవాల‌ని చెబుతున్న మాట‌లు చూస్తే.. చిరిగిన కొత్త నోట్ల‌తో జేబుకు చిల్లేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఎవ‌రైనా చిరిగిన కొత్త నోట్లు ఇస్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తీసుకోవ‌ద్దు. ఒక‌వేళ  తీసుకున్నారా?  ఆ నోట్ల మొత్తానికి సంబంధించి న‌ష్టం మీ జేబులోకి వ‌చ్చేసింద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.


Tags:    

Similar News