కళ్లు చెదిరే ఆదాయం.. 2 కొత్త జట్లకు వచ్చిన మొత్తం రూ.12వేల కోట్లు

Update: 2021-10-26 02:14 GMT
విన్నంతనే ఆశ్చర్యానికి గురయ్యే ఆదాయం. ఎంత పని చేస్తే.. ఎంత పెద్ద పరిశ్రమ పెడితే ఇంత ఆదాయం వస్తుంది? ఐపీఎల్ రేంజ్ ఎంతన్న విషయాన్ని చెప్పేసే తాజా ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. బీసీసీఐకు కాసుల పంటగా మారిన ఐపీఎల్ మరోసారి తానెంత కల్పతరువు అన్న విషయాన్ని రుజువు చేసింది. దాదాపు 13 ఏళ్ల క్రితం ఐపీఎల్ మొదలు పెట్టిన వేళలో ముంబయి ఇండియన్స్ జట్టు కోసం వేలం వేస్తే వచ్చిన గరిష్ఠ ఆదాయం రూ.535 కోట్లు మాత్రమే. ఇప్పుడు ఆ మొత్తానికి దాదాపు 15 రెట్లు అధికంగా ఒక కొత్త జట్టు కోసం వెచ్చిస్తున్న వైనం చూస్తే నోటి వెంట మాటలు రాని పరిస్థితి.

ఇప్పుడున్న జట్లకు అదనంగా లక్నో.. అహ్మాదాబాద్ ఫ్రాంచైజీల కోసం జరిగిన వేలంలో ఈ రెండు జట్లతో బీసీసీఐకు వచ్చిన ఆదాయం ఏకంగా రూ.12వేల కోట్లు కావటం విశేషం. ఇంత భారీ మొత్తం కేవలం రెండుజట్ల ఫ్రాంచైజీల అమ్మకంతో సాధ్యమంటే నమ్మశక్యంగా లేని పరిస్థితి. లక్నో జట్టు కోసం ఆర్పీఎస్జీ గ్రూపు రూ.7090 కోట్లు.. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కోసం సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ రూ.5625 కోట్లు చెల్లించి ఆ జట్లను తమ సొంతం చేసుకున్నాయి.

ఈ ఫ్రాంచైజీల వేలంలో తొమ్మిది పార్టీలు పోటీలో నిలిచాయి. మొత్తం ఆరు వేదికల్ని డిసైడ్ చేశారు. అవేమంటే..

1. అహ్మదాబాద్
2. లక్నో
3. కటక్
4. ధర్మశాల
5, గువాహటి
6. ఇండోర్

ఈ ఆరు జట్లకు బీసీసీఐ బిడ్డింగ్ నిర్వహించగా..అహ్మదాబాద్.. లక్నో జట్లకోసం అన్ని పార్టీలు బిడ్ వేశాయి. వీటిల్లో అత్యధిక మొత్తాన్ని కోట్ చేసిన గ్రూపులకు ఈ జట్లను ఎంపిక చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఐపీఎల్ జట్టు రేసులో ఖాయంగా భావించిన అదానీ గ్రూపునకు తాజా వేలంలో చుక్కెదురు కావటం గమనార్హం. రూ.5100 కోట్ల బిడ్ చేసిన అదానీ గ్రూపు ఏ ఫ్రాంచైజీని సొంతం చేసుకోలేకపోయింది. అహ్మదాబాద్ జట్టను ఎట్టి పరిస్థితుల్లో అదానీ సొంతమవుతుందని భావిస్తే అందుకు భిన్నంగా ఇరెలియా కంపెనీ అత్యధిక బిడ్ వేసి సొంతం చేసుకుంది. వాస్తవానికి ఈ బిడ్ రేసులో 20 సంస్థలు ఆసక్తి చూపాయి. అయితే.. వేలంలో పాల్గొనే సంస్థల టర్నోవర్ రూ.3వేల కోట్లు ఉండాలన్న నిబంధనతో పలు సంస్థలు అందుకోలేక.. వేలం నుంచి తప్పు కోవాల్సి వచ్చింది.
Tags:    

Similar News