అమ్మాయిని దుస్తులపై నుండి తాకడం లైంగిక వేధింపులే: సుప్రీం !

Update: 2021-11-18 09:44 GMT
పోక్సో చట్టం కింద లైంగిక వేధింపుల నేరం కేసులో స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్ తప్పనిసరి అని బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును దేశ అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టి వేసింది. స్పర్శ అనే పదాన్ని స్కిన్-టు-స్కిన్ కాంటాక్ట్‌ కి పరిమితం చేయడం సంకుచితమైన, అసంబద్ధమైన వివరణకి దారి తీస్తుందని, చట్టం యొక్క ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని న్యాయమూర్తులు జస్టిస్ లలిత్, ఎస్ రవీంద్ర భట్, బేలా త్రివేది లతో కూడిన సుప్రీం ధర్మాసనం వెల్లడించింది.

ఓ బాలిక దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని పేర్కొంటుందంటూ అప్పట్లో బాంబే హైకోర్టు వ్యాఖ్యానించడం సంచలనం రేపింది.

లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే అది లైంగిక వేధింపుల కిందకు వస్తుందని వెల్లడించింది. ‘స్కిన్-టు-స్కిన్’ కాంటాక్ట్‌ నిరూపితం కానందున ఈ చర్య పోక్సో చట్ట పరిధికి రాదని, నిందితుడిపై పోక్సో చట్టం కింద చర్యలు తీసుకోలేమని తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి చెప్పారు.

తాజాగా ఈ తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టం ఉద్దేశాన్ని నాశనం చేస్తుందని, నిందితుడు చట్టం నుంచి తప్పించుకునేందుకు దోహదపడుతుందని సుప్రీం వెల్లడించింది. 2016లో 39 ఏళ్ల సతీష్‌ అనే వ్యక్తి 12 ఏళ్ల బాధిత బాలికకు ఫ్రూట్ ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లాడు.

అక్కడ బాలిక వక్షస్థలాన్ని తాకి ఆమె దుస్తులు విప్పడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో భయంతో బాలిక గట్టిగా అరవడంతో.. తల్లి అక్కడికి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా దిగువ కోర్టు.. సాక్ష్యాదారాలను పరిశీలించి నిందితుణ్ని పోక్సో చట్టం కింద దోషిగా తేలుస్తూ శిక్షలు విధించింది.

దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు బాలిక ఛాతిని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా లేదా దుస్తుల లోపలికి చేయి పెట్టాడా అన్న నిర్దిష్టమైన వివరాలు లేవు కావున… దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేం అని పేర్కొంది.

నాగ్‌పుర్‌ బెంచ్‌కు చెందిన మహిళా న్యాయమూర్తి జస్టిస్‌ పుష్ప గనేడివాలాతో కూడిన ఏక సభ్య ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. ఆ కేసులో నిందితుడికి పోక్సో చట్టంలోని సెక్షన్‌ 8 కింద మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది.
Tags:    

Similar News