నితీష్ వర్సెస్ తేజస్వీ.. బీహార్ లో రసవత్తరం

Update: 2020-10-09 17:00 GMT
బీహార్ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయి. ఓవైపు సీఎం నితీష్ బీజేపీ మద్దతుతో చెలరేగిపోతుండగా.. మరోవైపు నాన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండడంతో మొత్తం బాధ్యతను తన భుజాలపై వేసుకొని కాంగ్రెస్ అండగా ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్ తొడగొడుతున్నారు.

బీహార్ లో మొత్తం 243 స్థానాలకు గాను మూడు దశల్లో పోలింగ్ జరుగనుంది. అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష యూపీఏ కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇక మధ్యలో ఎల్జేపీ,ఎన్సీపీలు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో రాజకీయం మరింత వేడెక్కుతోంది. ఇప్పటికే ఇరుపక్షాలు సీట్లు పంచుకున్నాయి. గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చాయి. ఎన్డీఏ నుంచి వైదొలిగిన ఎల్జేపీ 42 స్థానాల్లో పోటీచేస్తోంది. ఎక్కువగా బీజేపీ రెబల్స్ కే టికెట్ ఇచ్చింది.

మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ కూడా 40మందితో జాబితా సిద్ధం చేసి బీహార్ లో పోటీచేస్తోంది. ప్రచారానికి శరద్ పవార్ వస్తున్నారు. ఇక శివసేన కూడా 20 మందికి సీట్లు ఇచ్చి బరిలోకి దిగింది. ప్రచారానికి ఠాక్రేలు వస్తున్నారు.

243 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొదటి దశలో అక్టోబర్ 28న ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశ నవంబర్ 3న, మూడోదశ నవంబర్ 7న జరుగనున్నాయి. నవంబర్ 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ఇక కరోనా నిబంధనలు బీహార్ ఎన్నికల వేళ కేంద్రం తొలగించింది. ప్రచారాలు, ర్యాలీలు చేసుకోవచ్చని పార్టీలకు పేర్కొంది.
Tags:    

Similar News