బీజేపీకి అసలు పరీక్ష ఇదేనా?

Update: 2019-01-08 10:35 GMT
కేంద్ర కేబినెట్ ఇటీవల అగ్రవర్ణాల్లోని పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి గాను రాజ్యాంగ సవరణ చేసేందుకు లోక్ సభలో ఈరోజు 124వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీన్ని కేంద్రమంత్రి థావర్ చంద్ గెహ్లాట్ సభలో ప్రవేశపెట్టారు. లోక్ సభ, రాజ్యసభలో 2/3 మెజార్టీ సాధిస్తే ఈ బిల్లు ఆమోదం పొందుతుంది.

లోక్ సభ ఎన్నికలకు 4 నెలలు మాత్రమే ఉండగా అగ్రవర్ణాల్లోని పేదల ఓట్లు లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఆమోదం పొందుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

సోమవారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్రమంత్రివర్గం విద్య, ఉద్యోగ రంగాల్లో 10శాతం అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49.5శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. దీనికి అదనంగా 10శాతం కలిపితే 59.5శాతం అవుతుంది.

ఇక ఈ బిల్లు ఉభయ సభలతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల్లో కూడా ఆమోదం పొందితేనే కార్యరూపం దాల్చుతుంది. బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిపి 19 రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో బిల్లు ఆమోదం పొంది అగ్రవర్ణ పేదలకు లబ్ధి చేకూరడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీకి లబ్ధి చేకూర్చే ఈ పథకానికి  రాజకీయ పార్టీలు మద్దతు పలుకుతాయా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది.





Full View
Tags:    

Similar News