అమరావతిలో అద్భుత ద్వీపం

Update: 2015-10-08 17:30 GMT
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని భూతలం మీదే అద్భుత ప్రదేశంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నారు. అందుకు ఆర్థిక పరంగా ఎంత వరకు విజయవంతం అవుతారో అర్థం కావడం లేదు. కానీ, ఆయన ఆలోచనలు మాత్రం అద్భుతహ. తాజాగా కృష్ణా నదిలోని ఒక ద్వీపాన్ని ప్రపంచ పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు భావిస్తున్నారు.

కృష్ణానదిలో భవానీ ద్వీపం లాగే మరికొన్ని ద్వీపాలు ఉన్నాయి. వాటిలో పది నుంచి 12 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఒక ద్వీపాన్ని ఎంచుకుంటారు. అందులో వాటర్ స్పోర్ట్స్ - రిసార్ట్స్ - అంతర్జాతీయ స్థాయిలో హోటళ్లు, ఇతర సౌకర్యాలూ కల్పిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడికి వెళితే ఇక ప్రపంచాన్ని మరిచిపోవచ్చన్నమాట. అంతేనా.. రాజధాని అమరావతి నుంచి దానికి మూడు వంతెనలు నిర్మిస్తారు. ఇవి మూడూ కూడా నాలుగేసి వరుసల్లో ఉంటాయి. వెళ్లడానికి రెండు వరుసలు.. రావడానికి రెండు వరుసలు. అమరావతిలోని డౌన్ టౌన్ నుంచి ద్వీపానికి వెళ్లడానికి నేరుగా ఒక మార్గం ఉంటుంది. అంతేనా.. ఇందులో సైకిళ్లకు, పాదచారులకు ప్రత్యేక మార్గం ఉంటుంది. రద్దీ వేళ్లలో కేవలం సైకిళ్లను, పాదచారులను మాత్రమే అనుమతిస్తారు.

ఇక హైదరాబాద్ నుంచి వెళ్లే వారికి వంతెనలు కాకుండా జల మార్గం ఉంచనున్నారు. ఇక్కడ బోట్లు - పడవల ద్వారా ద్వీపానికి చేరుకునే ఏర్పాట్లు ఉంటాయి. నదిలోని ఒక ద్వీపాన్ని ఇలా తయారు చేస్తే ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వస్తారని, ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు సింగపూర్ నిపుణులకు సూచనలు కూడా చేశారు. పీపీపీ పద్ధతిలో ఇక్కడ సౌకర్యాలను ఏర్పాటు చేసి, వచ్చిన పర్యాటకుల నుంచి వసూలు చేసుకునేందుకు అయితే దీని రూపకల్పనకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. అయితే, అప్పుడు అందులోకి సామాన్యులకు ప్రవేశం ఉంటుందా అన్నది అనుమానమే.
Tags:    

Similar News