పిల్ల‌ల ప్రాణాలు తీసేస్తున్న లిచీ!

Update: 2019-06-15 04:41 GMT
పండ్లు ఏవైనా ఆరోగ్యాన్ని ఇస్తాయ‌ని చెబుతారు. పిల్ల‌లు ఎంతో ఇష్టంగా తినే లిచీ పండ్లతో ఆరోగ్యం ఖాయమ‌నుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. తాజాగా వెలువ‌డిన వాస్త‌వం ఒక షాకింగ్ గా మారింది. పిల్ల‌ల ప్రాణాల్ని లిచీ పండ్లు తీసే గుణం ఉంద‌న్న విష‌యాన్ని తాజాగా గుర్తించారు. బిహార్ లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ ప్రాంతంలో గ‌డిచిన 12 రోజుల్లో దాదాపు 50 మంది వ‌ర‌కు చిన్నారులు (ప‌దేళ్ల‌లోపు పిల్ల‌లు) ప్రాణాలు కోల్పోయిన ఉదంతం అక్క‌డ సంచ‌ల‌నంగా మారింది.

ఇలాంటి ప‌రిస్థితి ఎందుకు ఏర్ప‌డింద‌న్న విష‌యాన్ని తేల్చేందుకు రంగంలోకి దిగిన అధికారులు.. అస‌లు కార‌ణం తెలిసిన అవాక్కు అవుతున్నారు. మెద‌డువాపును పోలిన వ్యాధి కార‌ణంగా ఇంత భారీగా ప్రాణాలు వ‌దిలిన పిల్ల‌ల మ‌ర‌ణాల‌కు కార‌ణంగా లిచీ పండ్లు వారు మోతాదుకు మించి తిన‌ట‌మేన‌ని చెబుతున్నారు.

బిహార్ లోని ముజ‌ఫ‌ర్ న‌గ‌ర్ లిచీ పంట‌కు ఫేమ‌స్. వేస‌విలో పిల్ల‌లు ఆడుకుంటూ.. లిచీ పండ్ల‌ను తిన‌టం కామ‌న్. ఇదే వారి ప్రాణాల‌కు పెను ముప్పుగా మారింది. లిచీ పండ్ల‌తో అక్యూట్ ఎన్ సెఫ‌లైటీస్ వ్యాధి ల‌క్ష‌ణాలు వ‌చ్చేలా చేస్తాయ‌ని చెబుతున్నారు. ఎందుకిలా అంటే.. లిచీపండ్ల‌లో హైపోగ్లైసిన్ సైక్రోప్రొపైల్ అసిటిక్ ఆసిడ్ ఉంటుంది. ఈ పండ్ల‌ను ఎక్కువ‌గా తినే పిల్ల‌లు రాత్రిళ్లు భోజ‌నం మానేస్తుంటారు.

ఈ పండ్ల‌ను మితిమీరి తిన‌టం వ‌ల్ల రాత్రిళ్లు వారి చ‌క్కెర మోతాదుల‌ను గ‌ణ‌నీయంగా త‌గ్గించి వేస్తుంద‌ని తేల్చారు. లాన్సెట్ గ్లోబ‌ల్ హెల్త్ జ‌రిపిన అధ్య‌య‌నం తాజా విష‌యాన్ని వెల్ల‌డించింది. ప‌దేళ్ల లోపు పిల్ల‌లు ఉద‌యాన్నే ఏ ఆహారం తీసుకోకుండా లిచీ పండ్ల‌ను తిన‌కూడ‌ద‌ని పేర్కొంది. ఒక‌వేళ పిల్ల‌ల ఉద‌యం టిఫిన్ చేయ‌కుండా లిచీ పండ్ల‌ను తింటే.. రాత్రి వేళ‌ల‌లో త్వ‌ర‌గా భోజ‌నం తినాల‌ని వెల్ల‌డించింది.

40 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదయ్యే ప్రాంతాల్లో పిల్ల‌లు లిచీ పండ్ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. అదే ప‌నిగా ఈ పండ్ల‌ను తింటే ప్రాణాల‌కు ప్ర‌మాద‌మ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. ప్ర‌స్తుతం శ్రీ‌కృష్ణా మెడిక‌ల్ కాలేజ్ ఆసుప‌త్రిలో దాదాపుగా 40 మంది పిల్ల‌లు ఇదు త‌ర‌హా జ‌బ్బుతో చికిత్స పొందుతున్నారు. వారంద‌రూ లిచీ పండ్ల‌ను ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా తిన్న‌వారే కావ‌టం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News