నోరెత్తితే.. క‌ట‌క‌టాలే.. టీ కాంగ్రెస్ నేత‌ల‌పై అధిష్టానం కొర‌డా!

Update: 2022-12-28 02:30 GMT
తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కులు ఇటీవ‌ల కాలంలో హ‌ద్దు అదుపు లేకుండా.. సొంత పార్టీ అని కూడా చూడ‌కుండా.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. ముఖ్యంగా పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్రంగా అయితే.. సీనియ‌ర్లు.. జూనియ‌ర్లు అనే తేడా అంద‌రూరెచ్చిపోతున్నారు. ఇప్ప‌టికే బుజ్జగింపులు.. లాలింపులు అంటూ.. ఏవో కొంత ప్ర‌య‌త్నం చేసిన అధిష్టానం.. వారు దారికి రాక‌పోయేస‌రికి.. సంచ‌ల‌న నిర్ణ‌యంతో కొర‌డా ఝ‌ళిపించింది.

నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడానికి సామాజిక మాధ్యమాల్లో నాయకులను అవమాన పరిచేట్లు పోస్టులు పెట్టడమే ప్రధాన కారణమని కాంగ్రెస్‌ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏఐసీసీ దూతగా హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్‌తో జరిపిన చర్చల్లోనూ పలువురు నేతలు సామాజిక మాధ్యమాల లో పోస్టుల అంశాన్ని ప్రస్తావించారు. నాయకుల మనోభావాలను దెబ్బ తినేటట్లు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని… వాటిపై పార్టీ పరంగా ఎలాంటి చర్యలు లేవని పేర్కొన్నట్లు తెలుస్తోంది.

మనోభావాలు దెబ్బతీసి అవమానించేలా పెడుతున్న పోస్టులు కారణంగా... తాము తీవ్ర మానసికవేదనకు గురవుతున్నట్లు దిగ్విజయ్‌సింగ్ దగ్గర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఏఐసీసీ పార్టీకి నష్టం జరిగేటట్లు సామాజిక మధ్యమాల్లో పోస్టులు పెట్టిన వారిని తీవ్రంగా పరిగణిస్తోంది. ఎవరిపై పోస్టులు పెట్టినా సంబంధిత బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఫిర్యాదు చేయడం సహా న్యాయపరంగా ముందుకెళ్లాలని ఏఐసీసీ స్పష్టం చేసింది.

ఇందులో భాగంగా తాజాగా.. జర్నలిస్ట్ శంకర్ పేరుతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ట్వీట్ చేశారు. దానిని తీవ్రంగా పరిగణించిన పీసీసీ సంబంధిత ట్వీట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు... పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ల దగ్గర నుంచి కార్యదర్శుల స్థాయి వరకు… పదుల సంఖ్యలో వారి వారి ప్రదేశాలల్లో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టారని తప్పుడు ట్వీట్ చేసిన వ్యక్తిపై.. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసిన తీరును చూస్తుంటే … సామాజిక మాధ్యమాలలో పోస్టుల విషయంలో ఏఐసీసీ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి. అయితే.. ఇలా పోస్టులు పెడుతున్న‌వారి వెనుక కూడా.. సీనియ‌ర్లు ఉన్నార‌నే సందేహాలు క‌లుగుతున్న నేప‌థ్యంలోనే కాంగ్రెస్ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News