ఢిల్లీలో ఇంటికి వెళ్లటానికి 12 గంటలు

Update: 2016-07-29 16:26 GMT
ఈ మధ్యనే ఒక దేశంలో భారీ ట్రాఫిక్ జాం కారణంగా గంటల కొద్దీ రోడ్ల మీద వాహనాలు ఆగిపోయాయంటూ వార్త వస్తే ఆశ్చర్యపోయిన పరిస్థితి. తాజాగా అలాంటి చేదు అనుభవం దేశ రాజధాని ప్రజలకు అనుభవంలోకి వచ్చేసింది. గడిచిన రెండు రోజులుగా ఢిల్లీ చుట్టుపక్కల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అన్నింటికి మించి ఢిల్లీ.. గుర్గావ్ ఎక్స్ ప్రెస్ హైవే మీద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం కావటం సంచలనం సృష్టిస్తోంది.

ఈ ట్రాఫిక్ జాం గురించి గుర్తుకు వస్తేనే ఢిల్లీ వాసులు హడలిపోతున్నారు. గురువారం ఆఫీసు నుంచి బయలుదేరిన పలువురు వాహనదారులు మహా ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని శుక్రవారం ఉదయం ఇళ్లకు చేరుకున్న దుస్థితి. ఐటీ హబ్ అయిన గుర్గావ్ నుంచి ఢిల్లీకి రాకపోకలు సాగించే వేలాది మంది నరకం అంటే ఏమిటో ప్రత్యక్షంగా అనుభవించిన పరిస్థితి. బారీవర్షాల కారణంగా ట్రాఫిక్ జాం కావటం.. వాహనాలు నెమ్మదిగా నడుస్తున్న వేళ.. ఫస్ట్ గేర్ లో బండిని నడపాల్సి రావటంతో పెట్రోల్.. డీజిల్అయిపోయిన వాహనాలు రోడ్ల మీద ఆగిపోవటంతో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

చివరకు ఢిల్లీ ట్రాఫిక్ చీఫ్ స్వయంగా రంగంలోకి దిగి బైకు మీద వెళ్లి ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడాల్సి వచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీ – గుర్గావ్ హైవే దరిదాపుల్లోకి రాకుండా ఉండటం మంచిదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా ట్రాఫిక్ జాంపై వ్యంగ్యంగా వ్యాఖానించిన కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ట్వీట్ చేస్తూ.. ఢిల్లీ నుంచి గుర్గావ్ కు వెళ్లటం కంటే న్యూయార్క్ కు త్వరగా చేరుకోవచ్చని వ్యాఖ్యానించటం గమనార్హం. 
Tags:    

Similar News