దొంగలు బాబోయ్ దొంగలు!! భాగ్యనగరంలో వీరి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది! తాళం వేసి ఉన్న ఇళ్లకే కాదు.. చివరికి పోలీస్ స్టేషన్‌లో ఉన్న వాహనాలకు కూడా రక్షణ లేకుండా పోతోంది! ఇళ్ల మీదే కాదు ఇప్పుడు పోలీస్ స్టేషన్లనూ వదలడం లేదు! ఖరీదైన కార్లు పోలీస్ స్టేషన్ కు వచ్చాయని తెలిస్తే చాలు ఆ రాత్రికి దొంగలు తమ నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా.. పోలీసులు ఏంచేస్తున్నారో తెలియదుగాని.. ఇప్పుడు హైదరాబాద్ లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడి దోచుకెళ్లారు! ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం విశేషం!!
ఇటీవల డ్రంక్ డ్రైవ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే! వీటిపై తెలంగాణ సర్కారు కఠినంగా వ్యవహరిస్తోంది! ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ బ్రీత్ ఎనలైజర్లతో సిద్ధంగా ఉంటున్నారు. ఇన్ని చర్యలు తీసుకుంటున్నా.. మందు బాబులు మాత్రం తగ్గడం లేదు. కొంతమందిని పోలీసులు అరెస్టుచేసి వాహనాలు స్వాధీనం చేసుకుని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో భద్రపరుస్తున్నారు. ఇలా అమీర్ పేట సారధీ స్టూడియో వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సాంత్రో కారును స్వాధీనం చేసుకుని ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు ధ్వంసం చేసి అందులో ఉన్న డాక్యుమెంట్లతో పాటూ మ్యూజిక్ సెట్‌ను కూడా ఎత్తుకెళ్లిపోయారట. దీంతో విషయం గ్రహించిన ఎస్ ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు.. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.