శ్రీలంక‌లో విషాదం.. క‌డుపు నింపుకోవ‌డానికి వ్యభిచారం వృత్తిలోకి!

Update: 2022-07-20 14:51 GMT
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో ప‌రిస్థితులు నానాటికీ దిగ‌జారుతున్నాయి. గ‌త నాలుగు నెల‌లుగా విప‌రీత‌మైన అప్పులు, అడుగంటిన విదేశీ మార‌క ద్ర‌వ్యం, కోవిడ్ తో దిగ‌జారిన ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో శ్రీలంక ఆర్థికంగా ప‌త‌న‌మైన సంగ‌తి తెలిసిందే. ఓవైపు దేశాధ్య‌క్షుడు గొట‌బాయ రాజ‌ప‌క్ష దేశం వ‌దిలి సింగ‌పూర్ పారిపోయాడు.

నిత్యావ‌స‌ర వ‌స్తువులు, పాలు, మందులు త‌దిత‌రాలు అంద‌క శ్రీలంక ప్ర‌జ‌లు ఆక‌లితో అల‌మ‌టిస్తున్నారు. భార‌త్ ఇప్ప‌టికే చేయ‌గ‌లిగినంత సాయం చేసింది. కిలో బియ్యం, కిలో ట‌మాటాలు రూ.200 ప‌లుకుతుంటే కిలో క్యారెట్ రూ.500కి చేరింది. గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.5,500కు చేరింది. పెట్రోలు కోసం రోజులు త‌ర‌బ‌డి బంకుల ద‌గ్గ‌ర వాహ‌న‌దారులు ఎదురుచూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

శ్రీలంక పేద దేశం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక‌టిగా ఉంది. ప్ర‌స్తుత ఆర్థిక సంక్షోభంతో ముఖ్యంగా చిన్నారులు, మ‌హిళ‌లు ఆక‌లికి అల‌మ‌టిస్తున్నారు. మ‌హిళ‌ల ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయంగా ఉంద‌ని ఐక్య‌రాజ్య‌స‌మితితోపాటు ప‌లు సంస్థ‌ల నివేదికలు చెబుతున్నాయి. ప్రత్యేకించి వస్త్రపరిశ్రమలో పనిచేసే మహిళలు ఉద్యోగం పోతుందేమోననే భయంతో వ్యభిచార వృత్తిలోకి దిగుతున్నార‌ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. చిన్నారులతోపాటు త‌మ క‌డుపు నింపుకోవ‌డానికి ప‌డుపు వృత్తిని ఆశ్ర‌యిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కూరుకున్న ఈ నాలుగు నెల‌ల్లో సెక్స్ వ‌ర్క‌ర్లుగా చేరిన మ‌హిళ‌ల సంఖ్య 30 శాతానికి చేరింది అంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. శ్రీలంక రాజ‌ధాని న‌గ‌రం కొలంబో ప్రాంతంలో ఈ ఏడాది జనవరి నుంచి 'ఆయుర్వేద స్పా'ల ముసుగులో వ్యభిచార గృహాలు పుట్టుకొచ్చాయ‌ని మీడియా క‌థ‌నాలు తెలుపుతున్నాయి. ఇటీవల కాలంలో వీటి సంఖ్య గణనీయంగా పెరిగిందంటున్నారు.

ఉద్యోగం పోతుందనే భయంతో గత్యంతరం లేకే తాము ప‌డుపు వృత్తిలోకి దిగుతున్నట్లు వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేసే ఓ మహిళ చెప్పింది. ఉద్యోగం చేస్తే తమకు నెలకు రూ.28,000 నుంచి 35,000వరకు మాత్రమే వచ్చేదని, కానీ వ్యభిచారంలో రోజుకు రూ.15,000 సంపాదిస్తున్నట్లు వెల్లడించింది. ఎవరూ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజమని ఆమె పేర్కొనడం శ్రీలంక‌లో మ‌హిళ‌ల విషాదాన్ని క‌ళ్ల‌కు క‌ట్టింది.

అలాగే అనేక రంగాల్లో ఉద్యోగాలు పోవ‌డంతో కుటుంబాల‌ను పోషించుకోవ‌డానికి వ్య‌భిచారాన్ని ఆశ్ర‌యిస్తున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆహారం, మందుల కొనుగోలుకు డ‌బ్బుల్లేక అయిష్టంగానే స్థానిక వ్యాపారుల‌కు త‌మ శ‌రీరాల‌ను మ‌హిళ‌లు అప్ప‌గిస్తున్నార‌ని చెబుతున్నారు.

మ‌రోవైపు ప్రస్తుత విష‌మ‌ పరిస్థితిలో పిల్లలు, వృద్ధులైన తల్లిదండ్రులు, తోబుట్టువులకు అండగా ఉండేందుకు మహిళలు ఏం చేసేందుకైనా వెనుకాడటం లేదని శ్రీలంక సెక్స్ వర్కర్ల న్యాయవాద సమాఖ్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ అషిల దండేనియా చెబుతున్నారు. దేశంలో ఇతర వృత్తులతో పోల్చితే వ్యభిచారంలోనే అత్యంత వేగంగా డబ్బు సంపాదించవచ్చనే వాళ్లు ఇలా చేస్తున్నట్లు వివ‌రిస్తున్నారు.
Tags:    

Similar News