ఫేస్‌ బుక్‌ ముఖం మాడిపోయింది

Update: 2016-02-09 04:50 GMT
ఫ్రీ పేరుతో మొత్తం అంతర్జాల సమానత్వానికి ముప్పు తీసుకొస్తున్నాయని విమర్శలు ఎదుర్కొంటున్న ఫేస్‌ బుక్‌ 'ఫ్రీ బేసిక్స్‌'.. ఎయిర్‌ టెల్‌ జీరో ప్రతిపాదనలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత టెలికమ్‌ నియంత్రణ సంస్థ (ట్రాయి) వీటిని నిర్మొహమాటంగా తిరస్కరించింది.

ఉచితం పేరుతో మొత్తం ఇంటర్నెట్‌ ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ ఫ్రీ సాఫ్టువేర్ ఉద్యమ సంస్థ 'స్వేచ్ఛ', పలు ఇతర సంస్థలు ఉద్యమించిన నేపథ్యంలో ట్రాయ్  ఈ నిర్ణయం తీసుకుంది. నెట్‌ న్యూట్రాలిటీ ఉండాల్సిందేనని ట్రాయ్ స్పష్టం చేసింది. సమాన పరిమాణంలో ఉన్న డేటా వినియోగంపై ఏ టెలికాం సంస్థ అయినా వేర్వేరు ఛార్జీలను వసూలు చేయరాదని కూడా స్పష్టం చేసింది. ఇంటర్నెట్‌ లో వినియోగదారులకు వేర్వేరు ధరలను నిర్ణయించే పద్ధతికి స్వస్తి చెప్పాలని ట్రాయ్ ఆదేశించింది. దీంతో ఎయిర్‌ టెల్‌ జీరో - ఫేస్‌ బుక్‌ ఫ్రీ బేసిక్స్‌ ‌లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

గత కొద్ది నెలలుగా ట్రాయ్ -  ఫేస్‌ బుక్‌ ల మధ్య నెట్‌ న్యూట్రాలిటీపై వివాదం ఉంది.  తన ఫ్రీ బేసిక్స్‌ ప్లాట్‌ ఫామ్‌ కు మద్దతు కూడగట్టాలని ఫేస్‌ బుక్‌ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ మేరకు ఓ అప్లికేషన్‌ ను సేవ్‌ చేసుకోవాలంటూ వినియోగదారులను కోరుతూ ప్రచారం మొదలెట్టింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. తన ఆదేశాలను ఉల్లంఘిస్తే రోజుకు రు.50 వేల నుండి 50లక్షల వరకు జరిమానా విధిస్తామని ట్రాయ్ హెచ్చరించింది. ఏ సర్వీసు ప్రొవైడరూ ఎటువంటి ఒప్పందాలూ కుదుర్చుకోకూడదు అని పేర్కొంది.

ఫ్రీ బేసిక్స్‌ లాంటి ప్రయత్నాలు ఇంటర్‌ నెట్‌ విస్తృతిని కుదించి ఫేస్‌ బుక్‌ లాంటి కొన్ని సర్వీసులను మాత్రమే మొత్తం ఇంటర్‌ నెట్‌ గా భావించేలా చేసే ప్రమాదం ఉంది. దీంతో దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఫేస్ బుక్ ఈ విషయంలో తనకు అనుకూలమైన నిర్ణయాన్ని సాధించడానికి వందల కోట్లు ఖర్చు చేసింది. మీడియాలో ఫ్రీబేసిక్స్ కు వ్యతిరేకంగా కథనాలు రాకుండా భారీ యాడ్లు ఇచ్చి తనకు వ్యతిరేకత రాకుండా చూసుకుంది. ఎన్ని చేసినా కూడా ట్రాయ్ మాత్రం ఆ మాయలో పడకుండా కోట్లాది మంది ఇంటర్నెట్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడింది.

ట్రాయ్ నిర్ణయాన్ని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ - ఐఏఎంఏఐ, తదితర పరిశ్రమ వర్గాలతో పాటు విపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర నెట్ న్యూట్రాలిటీ మద్దతుదారులు స్వాగతించారు. ఇది భారత్‌ లోని ఇంటర్ నెట్ యూజర్ల ఘన విజయమని సోషల్ నెట్‌ వర్కింగ్ సైట్ ట్విట్టర్ లో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నిబంధనలను ప్రశంసిస్తూ కాంగ్రెస్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది.
Tags:    

Similar News