గుడ్ న్యూస్..జస్ట్ రూ.130కు 200 చానళ్లు

Update: 2020-01-02 06:05 GMT
కొత్త రూల్ తో మారిన టారిఫ్ లతో కేబుల్ బిల్లు గూబ వాయిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై వినియోగదారుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్న వేళ.. ట్రాయ్ కొత్త సంవత్సరం వేళ సరికొత్త కానుకను ప్రకటించింది. ఇటీవల కాలంలో ఎటు చూసినా ఛార్జీల వడ్డింపే తప్పించి.. తగ్గింపు లేని వేళ.. అందుకు భిన్నంగా ట్రాయ్ మాత్రం గుడ్ న్యూస్ చెప్పేసింది. తాజాగా వెలువరించిన ఆదేశాల మేరకు 200 చానళ్లను కేవలం రూ.130లకే చెల్లించాలన్న కొత్త రూల్ ను తీసుకొచ్చింది.

గతంలో ట్రాయ్ చేసిన రూల్స్ ను తమకు తగ్గట్లుగా మార్చుకున్న కేబుల్ ఆపరేటర్లు.. డిష్ నెట్ వర్క్ లు భారీగా బాదేయటం.. బొకేల పేరుతో చానళ్లు సొమ్ము చేసుకున్న వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో.. కళ్లు తెరిచిన ట్రాయ్ తాజాగా తాను తీసుకొచ్చిన చట్టానికి సవరణలు చేపట్టింది. కొత్త విధానాన్ని ప్రకటించింది.

దీని ప్రకారం ఒక భాషకు చెందిన చానళ్లు అన్ని ఒకే వరుసలో ఉండాలి. చానల్ నెంబరును తరచూ మార్చకూడదని.. ఒకవేళ అలా మార్చాల్సి వస్తే.. తప్పనిసరిగా ట్రాయ్ అనుమతి తీసుకోవాలంటూ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీంతో చానళ్లను ఒక ఆట ఆడించే ఆపరేటర్లకు చెక్ పెట్టినట్లైంది.

తాజాగా చేసిన సవరణల ప్రకారం గతంలో వంద చానళ్లు తప్పనిసరిగా ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ స్థానంలో వందకు బదులుగా 200 చానళ్లుగా చేశారు. అంతేకాదు వినియోగదారుడు కానీ రూ.160 చెల్లిస్తే సర్వీసు ప్రొవైడర్ తమ వద్ద ఉన్న ఉచిత చానళ్లు అన్నింటిని ఇవ్వాల్సి ఉంటుంది.

 పలు చానళ్లు తమ వద్ద ఉన్న చానళ్లను గంపగుత్తగా (బొకేగా) అమ్మే పద్దతిని తీసుకొచ్చి.. తమకున్న చానళ్లను విడిగా కొనుగోలు చేద్దామనుకుంటే వాటికి అధికంగా ధరలు పెట్టారు. దీంతో.. వినియోగదారులు తమకు అవసరం ఉన్నా లేకున్నా బొకేను తీసుకోవాల్సి వచ్చేది. దానికి తాజా నిబంధనల్లో చెక్ పెట్టారు.

తాజా నిబంధన ప్రకారం బొకేలోని చానళ్ల ధరకు ఒకటిన్నర రెట్లకు మించకుండా అలాకార్టే (దేనికదే) విధానంలో ఉండకూడదు. ఉదాహరణకు ‘‘ఎ’’ అనే సంస్థకు ఉన్న పలు చానళ్లను గంపగుత్తగా తీసుకుంటే రూ.30 ఇస్తామని చెప్పి..ఒక్కొక్కటిగా తీసుకుంటామంటే భారీ ధర వసూలు చేయకూడదు. దీని ప్రకారం సదరు సంస్థకు చెందిన అన్ని చానళ్లను విడివిడిగా కొనుగోలు చేసినా దాని ధర రూ.45కు మించకూడదు.

గతంలో ఒక చానల్ గరిష్ఠ ధర రూ.19గా ఉండేది. దాన్ని కాస్తా రూ.12గా తగ్గించారు. ఒక ఇంట్లో రెండు కనెక్షన్లు ఉంటే రెండో కనెక్షన్ కు నెలకు కట్టాల్సిన మొత్తాన్ని రూ.130 ప్లస్ పన్నుల స్థానే కేవలం రూ.40 మాత్రమే కడితే సరిపోతుందని పేర్కొంది. ఇలా పలు మార్పులు వీక్షకులకు మేలు చేసేలా.. ఖర్చు తగ్గించేలా ఉన్నాయి. ఈ కొత్త విధానం మార్చి ఒకటి నుంచి అమలు కానుంది.

Tags:    

Similar News