కోట్ల మందికి మేలు కానున్న రాజ్ నాథ్ ఆగ్ర‌హం

Update: 2017-09-17 04:36 GMT
ఎవ‌రికి కాలాలో వారికే కాలింది. సామాన్యుడికి ఎన్ని చికాకులు వ‌చ్చి ప‌డినా ఎవ‌రికి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు. కానీ.. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారికి క‌లిగే అసౌక‌ర్యం.. ఇబ్బంది కోట్లాదిమందికి లాభంగా మారుతుంద‌న్న మాట మ‌రోసారి నిజ‌మైంది. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ మ‌ధ్య‌న ఒక చేదు అనుభ‌వం ఎదురైంది. అదిప్పుడు కోట్లాది మందికి మేలు చేయ‌నుంది.  ఆ మ‌ధ్య‌న రాజ్ నాథ్ సింగ్ ఫోన్‌ కి ఒక కాల్ వ‌చ్చింది.
 
ఆ కాల్ సారాంశం ఏమిటంటే ముంబ‌యి స్టాక్ ఎక్సైంజ్ లో మంచి ఆఫ‌ర్లు ఉన్నాయ‌ని.. పెట్టుబ‌డి పెడితే ఫ్యూచ‌ర్ అదిరిపోతుంద‌ని పేర్కొన్నారు. ఆ త‌ర్వాత నుంచి ఆయ‌న మొబైల్‌ కు అదే ప‌నిగా మెసేజ్ లు రావ‌టం మొద‌ల‌య్యాయి. దీంతో.. రాజ్ నాథ్‌ కు చిర్రెత్తుకొచ్చింది. అధికారుల్ని పిలిపించి.. బ‌ల్క్ మెసేజ్ ల సంగ‌తి ఏమిటో చూడాల‌ని.. రూల్ బుక్‌ ను తిర‌గేయాల‌ని.. కేంద్ర హోంశాఖ‌తో పాటు.. సెబీ.. టెలికామ్ రెగ్యుల‌రేట‌రీ అథారిటీని  ఆదేశించారు.

స్వ‌యంగా రాజ్ నాథ్ ఆదేశాల‌తో వ్య‌వ‌స్థ క‌దిలింది. రూల్ బుక్ ప్ర‌కారం చూస్తే.. టెలీ మార్కెటింగ్‌.. స్పామ్‌.. బ‌ల్క్ మెసేజ్ ల మీద ఏ ఒక్క‌శాఖ‌కు పూర్తిస్థాయి నియంత్ర‌ణ లేద‌న్న విష‌యాన్ని గుర్తించారు. అంతే.. ఆ లోపాన్ని స‌రిచేసి కొత్త‌గా మార్గ ద‌ర్శ‌కాల్ని విధించాల‌ని ఆదేశించారు.  దీంతో అధ్య‌య‌నం చేసిన అధికారులు తాజాగా టెలికామ్ ఆప‌రేట‌ర్స్‌ కు స‌రికొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేశారు.  దీని ప్ర‌కారం చూస్తే.. స్టాక్ మార్కెట్ ప్ర‌మోష‌న్‌ కు సింగిల్‌.. బ‌ల్క్ మెసేజ్ లు సెబీ గుర్తింపు ఉన్న స‌ల‌హాదారులు.. బ్రోక‌ర్లు.. పోర్టుఫోలియో మేనేజ‌ర్లు.. మ‌ర్చంట్ బ్రోక‌ర్లు ద్వారానే వెళ్లాల‌ని డిసైడ్ చేశారు.

గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు..సంస్థ‌లు ఈ త‌ర‌హా మెసేజ్ లు పంప‌కుండా ట్రాయ్ చ‌ర్య‌లు తీసుకోవాలి. రిజిస్ట‌ర్ టెలీ మార్కెటింగ్ విధానాన్ని ప‌క్కాగా అమ‌లు చేయాలి. వారి ద్వారానే ప్ర‌మోష‌న‌ల్ మెసేజ్ లు వెళ్లేలా ఆప‌రేట‌ర్లు గ‌ట్టి చ‌ర్య‌లు తీసుకోవాల్సి ఉంటుంది. ఇది బీఎస్ ఎన్ ఎల్‌ కు వ‌ర్తించేలా చేశారు. విన‌యోగ‌దారుడు స్వ‌యంగా బ‌ల్క్ మెసేజ్‌ ల‌ను బ్లాక్ చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించాలి. రియ‌ల్ ఎస్టేట్‌.. ఫైనాన్స్‌.. రుణాలు.. షాపింగ్ సంస్థ‌ల నుంచి బ‌ల్క్ మెసేజ్ లు క‌స్ట‌మ‌ర్ల‌కు డంప్ కాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఏమైనా.. రాజ్ నాథ్‌కు మంట పుట్ట‌టం ఏమో కానీ వ్య‌వ‌స్థ‌లోని ఒక లోపాన్ని స‌రిచేసే ప్ర‌య‌త్నం మొద‌లైంద‌ని చెప్పాలి.
Tags:    

Similar News