ఫేస్‌ బుక్‌ కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌

Update: 2016-01-20 13:44 GMT
ఫ్రీ బేసిక్స్ పేరుతో ఇంట‌ర్నెట్‌ పై ప‌ట్టుబిగించేందుకు ఎత్తులు వేసిన ఫేస్‌ బుక్‌ పై టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ దుమ్ముదులిపింది. ఇంట‌ర్నెట్‌ ను త‌న చేతుల్లో ఉంచేందుకు వ‌క్ర‌మార్గంలో చేస్తున్న ఎత్తుగ‌డ‌లు అంటూ మార్గ్ జుక‌ర్‌ బ‌ర్గ్ మాన‌స‌పుత్రిక‌పై మండిప‌డింది. నెట్ న్యూట్రాలిటీ- ఫేస్‌ బుక్ ఫ్రీ బేసిక్స్ మ‌ధ్య వాదోప‌వాదాలు న‌డిచిన నేప‌థ్యంలో తుది నిర్ణ‌యం కోసం ట్రాయ్ ప్రజాభిప్రాయాలు స్వీక‌రించిన సంగ‌తి తెలిసిందే.

ట్రాయ్ పిలుపుతె ఫ్రీ బేసిక్స్‌ కు అనుమతి ఇవ్వాలంటూ లక్షల మెయిల్స్‌ ట్రాయ్‌ కు చేరాయి. అయితే డేటా సర్వీసుల కోసం అమలులో ఉన్న వివిధ ధరలకు సంబంధించి ట్రాయ్ ఫేస్‌ బుక్‌ ను వివిధ ప్ర‌శ్న‌లు అడిగింది. భారత ఫేస్‌ బుక్ డైరక్టర్ అంఖి దాస్‌ కు ఆ లేఖను ట్రాయ్ సంధించింది. దీనికి ఫేస్‌ బుక్ ప్ర‌తినిధి సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఈ త‌తంగాన్ని ట్రాయ్ ఖండించింది. ఫ్రీ బేసిక్స్ ప్రచారం కోసం ఫేస్‌ బుక్ వ్యవహరించిన తీరును తీవ్రంగా త‌ప్పుప‌డుతూ దానికి సంబంధించిన అధికారిక లేఖను ట్రాయ్ విడుదల చేసింది.

త‌న ఆలోచ‌న‌కు మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునేందుకు ఫేస్‌ బుక్ వ్య‌వ‌హ‌రించిన తీరు స‌రికాద‌ని మండిప‌డింది. రాజ్యాంగ‌బ‌ద్ద సంస్థగా వినియోగ‌దారుల ప్ర‌యోజ‌నాల కోణంలో అడిగే ప్రశ్నలకు బదులు ఇవ్వకుండా కస్టమర్లతో ఫ్రీ బేసిక్స్‌ కు మద్దతు కూడగట్టుకోవాలనుకోవడం సరైంది కాదని ట్రాయ్ మండిప‌డింది. ఒకవేళ ఫేస్‌ బుక్ సూచనలను అంగీకరిస్తే.. అది ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ప్రమాదకర ప్రభావం చూపుతుందని ట్రాయ్ తన లేఖలో అభిప్రాయపడింది.
Tags:    

Similar News