మిస్సైన చంద్రముఖి దొరికింది..

Update: 2018-11-29 08:22 GMT
మనం ఇప్పుడు చెప్పుకునేది రజనీకాంత్ సినిమాలోని చంద్రముఖి గురించి కాదు... తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన టాన్స్ జెండర్ చంద్రముఖి గురించి. రెండురోజుల క్రితం ఆమె అదృశ్యం కావడం సంచలనంగా మారింది. గోషామహల్ అసెంబ్లీ స్థానానికి బీఎల్ ఎఫ్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చంద్రముఖి నాలుగు రోజుల కిందటి నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. మంగళవారం ఉదయం నుంచే చంద్రముఖి కనిపించడం లేదంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. మరునాడు కూడా ఆమె ఆచూకీ లభించకపోవడంతో బీఎల్ఎఫ్ నేతలు - ప్రజాసంఘాలు -  ట్రాన్స్ జండర్లు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమ పార్టీ అభ్యర్థి అదృశ్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలిచిన చంద్రముఖి అదృశ్యం కేసును పోలీసులు సీరియస్ గా తీసుకొని పురోగతి సాధించారు. సీసీ ఫుటేజీ - ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం అర్ధరాత్రి ఆమె ఆచూకీని ఇందిరానగర్లో కనుకొన్నారు. అనంతరం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. అయితే చంద్రముఖిని ఎవరూ కిడ్నాప్ చేయలేదనేది పోలీసుల వాదన. తనకు తానుగా అదృశ్యమైనట్లు వారు భావిస్తున్నారు. చంద్రముఖి ఫోన్ సంభాషణల ఆధారంగా తాను సహచర ట్రాన్స్ జెండర్లతో మాట్లాడినట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు.
 
అయితే చంద్రముఖి వాదన మరోలా ఉంది. తనను ఇద్దరు వ్యక్తులు బెదిరించి కిడ్నాప్ చేశారని చంద్రముఖి చెబుతుంది. విజయవాడకు తీసుకెళ్లి అక్కడి నుంచి చెన్నైకి తరలించారని చెబుతున్నారు. అక్కడి నుంచి తప్పించుకొని హైదరాబాద్ కు చేరుకున్నానని చెబుతున్నారు.
 
ఈ కేసులో వెంకట్ అనే పేరు బయటకు వచ్చింది. గతంలోనూ వెంకట్ అనే వ్యక్తి ట్రాన్స్ జెండర్లపై భౌతిక దాడులకు దిగడమే కాకుండా నగదు - నగలు ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వెంకట్ చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నట్లు సమాచారం. వెంకట్ అనంతపురం సమీపంలో ఉన్నాడనే సమాచారంతో అక్కడికి ప్రత్యేక గాలింపు బృందాలను పంపినట్టు తెలుస్తోంది.
 
ఏదిఏమైనా చంద్రముఖి అదృశ్యం.. రెండు రోజులుగా కొనసాగుతున్న హైడ్రామాకు పోలీసులు తెరదించడంతో కథ సుఖాంతమైంది.  అయితే చంద్రముఖి తనకు తాను అదృశ్యమయ్యరా లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా అనేది పోలీసులు దర్యాప్తులో వెల్లడికానుంది. కాగా ఒక్కసారిగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థి కనిపించకుండా పోవడం తెలంగాణ రాజకీయాలను వేడెక్కించింది.
Tags:    

Similar News