ఫేస్ బుక్ లో పరిచయం..వారి పెళ్లికి కలెక్టర్ లేఖ ఇవ్వాల్సి వచ్చింది

Update: 2019-08-09 05:30 GMT
డిజిటల్ విప్లవం దేశంలోని ప్రతి మూలకు చేరుకున్న వేళ.. ప్రతి సందు.. గొందులోకి సోషల్ మీడియా.. వాట్సాప్ దూసుకొచ్చేసింది. ఇవన్నీ పాతపడిపోయి.. టిక్ టాక్.. హోలో లాంటి ఎన్నో కొత్త వేదికలు ప్రతి ఒక్క ఫోన్ లోనూ ఉంటున్న పరిస్థితి. ఈ కొత్త పరిచయాలతో పుట్టుకొచ్చే ప్రేమల్లో కొన్ని సంచలనానికి కారణమవుతున్నాయి. తాజాగా చెప్పేది అలాంటిదే. ఫేస్ బుక్ లో పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకూ వెళ్లే ట్రెండ్ మొదలై పదేళ్లకు పైనే అయ్యింది. ఇప్పుడు చాలా కామన్ కూడా.

కానీ.. తాజా ఉదంతం మాత్రం వార్త ఎందుకైందంటే అందుకు కారణం లేకపోలేదు. పెళ్లి చేసుకున్న ఈ జంటలో ఒకరు ట్రాన్స్ జెండర్. ఫేస్ బుక్ లో మొదలైన వీరి స్నేహం డీప్ లవ్ లోకి వెళ్లి.. చివరకు విడిచిపెట్టలేనంతగా మారటంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లి వ్యవహారం విన్న అబ్బాయి ఇంట్లో వారు ససేమిరా అనేశారు. ట్రాన్స్ జెండర్ ను ఎలా పెళ్లాడతావన్నది వారి అభ్యంతరం. ఇంతకూ వారెవరంటే.. తమిళనాడులోని కడలూరు జిల్లా తిరువందిపురం సాలైకరైకు చెందిన ట్రాన్స్ జెండర్ అమృత(22). ఫేస్ బుక్ ద్వారా తమిళనాడులోని విళుపురంజిల్లా చిన్న సేలంకు చెందిన 27 లక్ష్మణ్ తో పరిచయమైంది. ముంబయిలో సినీ కార్మికుడిగా పని చేస్తున్నారు.

వీరి పెళ్లికి తొలుత లక్ష్మణ్ ఇంట్లో అభ్యంతరం వ్యక్తం కాగా.. చివరకు ఒప్పుకోక తప్పలేదు. ఓకే అన్న తర్వాత వారి పెళ్లిని తిరువందిపురంలోని గుడిలో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ పెళ్లి గురించి తెలుసుకున్న గుడి నిర్వాహకులు పెళ్లి చేసేందుకు నో చెప్పేశారు. దీంతో.. జిల్లా కలెక్టర్ కు లేఖ రాసి అనుమతి పొందారు. జిల్లా కలెక్టర్ నుంచి లేఖ రావటంతో ఆలయ అధికారులు అంగీకరించక తప్పలేదు. వీరి పెళ్లి జరుగుతున్న వేళ.. ఆసక్తిగా వెళ్లి చూసినోళ్లంతా అవాక్కు అయ్యే పరిస్థితి. మరి.. ఇలాంటి పెళ్లిళ్లు చాలా అరుదుగా జరుగుతాయి కదా?
Tags:    

Similar News