సింగ‌ర్ పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు!

Update: 2019-06-20 10:42 GMT
ఆర్ ఎస్ ఎస్ సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ పైనా.. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాధ్ పై అనుచిత రీతిలో వ్యాఖ్య‌లు చేసిన ఒక గాయ‌నిపై దేశ ద్రోహం కేసు న‌మోదైంది. సంచ‌ల‌నంగా మారిన యూకే కు చెందిన గాయ‌ని త‌ర‌న్ కౌర్ ధిల్లాన్ షార్ట్ క‌ట్ లో హార్ద్ కౌర్ త‌న సోష‌ల్ మీడియా వ్యాఖ్య‌ల‌తో పెనుదుమారాన్నే రాజేశారు.

ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌పై పెద్ద ఎత్తున  నిర‌స‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ‌తో పాటు అన‌వ‌స‌ర‌మైన ఉద్రిక్త‌త‌ల్ని తెర మీద‌కు వ‌చ్చేలా చేసిన ఆమె తీరుపై వార‌ణాసికి చెందిన సంఘ్ కార్య‌క‌ర్త క‌మ్ న్యాయ‌వాది శ‌శాంక్ శేఖ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె సోష‌ల్ మీడియా ఖాతాల‌ను ప‌రిశీలించిన పోలీసులు ఆమెపై దేశ ద్రోహం కేసును న‌మోదు చేశారు.

ఇంత‌కీ త‌ర‌న్ ఏం వ్యాఖ్య‌లు చేశార‌న్న‌ది చూస్తే.. యూపీ సీఎం యోగిని ఆమె ఏకంగా రేప్ మేన్ గా పిల‌వాల‌ని కోరారు. ఇక‌.. సంఘ్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ ను ఉగ్ర‌వాదిగా పేర్కొనాల‌ని కోరారు. ఆమె త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌ను ఉద్దేశించి అనుచితంగా వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ లో చోటు చేసుకున్న ఉగ్ర ఘ‌ట‌న‌ల‌కు.. పుల్వామా దాడికి కార‌ణం సంఘ్ చీఫ్ గా ఆమె పేర్కొన్నారు. రెచ్చ‌గొట్టేలా ఉండ‌ట‌మే కాదు.. మ‌నోభావాలు దెబ్బ తినేలా ఉన్న ఆమె వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి.

ఆమె పెట్టిన పోస్టుకు కొంద‌రు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం అందుకు భిన్నంగా తిట్టిపోశారు. ఆమె వాద‌న ఏ మాత్రం స‌రికాద‌న్నారు. హ‌ర్ద్ కౌర్ పై సెక్ష‌న్ 124ఏ.. 153ఏ.. 500 కింద (దేశ‌ద్రోహం.. మ‌తం ప్రాతిప‌దిక‌న వివిధ వ‌ర్గాల మ‌ధ్య శ‌త్రుత్వాన్ని ప్రోత్స‌హించ‌టం.. ప‌రువున‌ష్టం క‌లిగించ‌టం.. రెచ్చ‌గొట్టే ఉద్దేశంతో వ్య‌వ‌హ‌రించ‌టం.. ఐటీ చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌టం లాంటి నేరారోప‌ణ‌లు)ఎఫ్ఐఆర్ న‌మోదైంది. ఆమె వ్యాఖ్య‌ల‌పై పోలీసులు ద‌ర్యాప్తు షురూ చేశారు.


Tags:    

Similar News