త్రిముఖ పోరులో ఎవరిది గెలుపు.?

Update: 2019-05-16 01:30 GMT
అక్కడ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి నెలకొందట..మూడు ప్రధాన పార్టీల్లో ప్రజలు ఎవరి కొంప ముంచారోనన్న ఆందోళన నేతలను పట్టి పీడిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయం ఎవరిదనేది చెప్పడం చాలా కష్టంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టీడీపీ, వైసీపీ, జనసేన అభ్యర్థుల మధ్య రాజోలులో ఫైట్ నువ్వానేనా అన్నట్టుగా సాగింది. త్రిముఖ పోరులో గెలుపు ఎవరిదనేది నియోజకవర్గంలో కూడా ఎవ్వరూ ఊహించని విధంగా పరిస్థితి ఉంది. టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, జనసేన నుంచి రాపాక వరప్రసాదరావు.. వైసీపీ నుంచి బొద్దు రాజేశ్వరరావు ఇక్కడ నుంచి పోటీచేశారు.

2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన వరప్రసాద్ రావు...2014లో పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి మారి పోటీచేశారు. అయితే ఈయనకు ప్రజాశాంతి పార్టీ అనుకోని జలక్ ఇచ్చింది. బొంతు రాజేశ్వరరావు పేరుతో మరో వ్యక్తి పోటీచేయడంతో అచ్చం ఇద్దరి పేర్లు దగ్గరదగ్గరగా ఉండి ఓటర్లు తికమక పడ్డారన్న టాక్ వినిపించింది.

రాజోలు నియోజకవర్గంలో ఎస్సీల ఆధిక్యం ఉంది. ఆ తర్వాత కాపుల ప్రాబల్యం ఎక్కువ. ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గం కావడంతో ముగ్గురు నేతలు ఆశలు పెంచుకున్నారు. కాపులు ఎక్కువగా ఉండడంతో జనసేన కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక టీడీపీ మాత్రం పసుపు కుంకుమ, అన్నదాత సుఖీ భవ పథకాల ప్రభావం బాగా ఉందని తమదే గెలుపు అని అంటున్నారు. 85శాతం నమోదైన అత్యధిక పోలింగ్ తమకే లాభిస్తుందంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి సైతం గత సారి ఓడిపోయిన సానుభూతి ప్రజల్లో ఉంది. పైగా పోయిన సారి 62వేల ఓట్లు సాధించారు. దీంతో ఆ ఓట్లు పడినా.. జనసేన చీలికతో తనదే గెలుపు అని వైసీపీ అభ్యర్థి భావిస్తున్నారు. ఇలా త్రిముఖ పోరులో ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠ రాజోలులో రాజ్యమేలుతోంది.
    

Tags:    

Similar News