టీ కాంగ్రెస్‌లో ఒక సీటు.. ట్ర‌యాంగిల్ ఫైట్‌..!

Update: 2021-11-06 03:52 GMT
తెలంగాణ రాజ‌కీయాలు ఎప్పుడూ ఏదో ఒక ఎన్నిక‌తో ర‌స‌వత్త‌రంగానే న‌డుస్తున్నాయి. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్లే టైం ఉండ‌డంతో ఏ పార్టీలో చూసినా టిక్కెట్ల కోసం అప్పుడే వేట మొద‌లైపోయింది. ఇక నిన్న‌టి వ‌ర‌కు జీవ‌చ్ఛ‌వంలా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి రావ‌డంతో ఆ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఉత్సాహం అయితే వ‌చ్చింది. ఈ క్ర‌మంలోనే ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు ఎవ‌రికి వారు అప్పుడే సీట్ల‌పై ఖ‌ర్చీఫ్ వేసే ప‌నిలో బిజీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఉమ్మ‌డి పాలమూరు జిల్లాలో ఓ నియోజ‌క‌వ‌ర్గం పై ఖ‌ర్చీఫ్ వేసేందుకు ఏకంగా ముగ్గురు కీల‌క నేత‌లు పోటీ ప‌డుతున్నారు. దీంతో ఇప్పుడు అక్క‌డ రాజ‌కీయ కాక రేగింది.

జ‌డ్చ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయ సంచ‌ల‌నాల‌కు ఎప్పుడూ మారుపేరే. ఇక్క‌డ నుంచి గ‌తంలో టీడీపీ త‌ర‌పున గెలిచిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖ‌ర్ తిరిగి కాంగ్రెస్‌లోకి వ‌చ్చేందుకు రెడీగా ఉన్నారు. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న ఆయ‌న కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తానండే పార్టీ కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఆయ‌న‌కు రేవంత్ అండ‌దండ‌లు ఉండ‌డంతో సీనియ‌ర్ నేత‌ల‌కు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. పార్టీ సీనియ‌ర్ నేత, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లు ర‌వి ఈ సీటుపై క‌న్నేసి త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు. పైగా పార్టీ గెలిస్తే త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఆయ‌న ఉన్నారు.

అయితే జిల్లాలో మ‌రో రెండు ఎస్సీ రిజ‌ర్వ్ డ్ సీట్లు ఉన్నాయి. కావాలంటే ర‌విని అక్క‌డ‌కు పంపాల‌ని రేవంత్ ప్లాన్ చేస్తున్నారు. ఇక్క‌డ ముదిరాజ్ ఓటు బ్యాంకు ఎక్కువ‌. దీంతో ఆ వ‌ర్గానికి చెందిన ఎర్ర శేఖ‌ర్‌ను పార్టీలో చేర్చుకుని సీటు ఇవ్వాల‌ని రేవంత్ భావిస్తున్నారు. ఇక్క‌డే ఓ ట్విస్ట్ ఉంది.. రేవంత్ పీసీసీ అధ్య‌క్షుడు కావాలంటూ ఉత్త‌మ్ కుమార్ కు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపించాడు మ‌ల్లు ర‌వి. మ‌రి ఆయ‌న్ను కాద‌ని ఎర్ర శేఖ‌ర్‌కు సీటు ఇస్తారా ? అన్న‌ది చూడాలి.

ఇక వీరిద్ద‌రితో పాటు మ‌రో యువ‌నేత అనిరుధ్ రెడ్డి కూడా జ‌డ్చ‌ర్ల కాంగ్రెస్ టిక్కెట్‌పై క‌న్నేసి అక్క‌డ కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి రెడ్డి నేత ల‌క్ష్మారెడ్డి పోటీలో ఉంటారు. అందుకే రెడ్డి కోటాలో త‌న‌కే సీటు కావాల‌ని ఆయ‌న లాబీయింగ్ చేస్తున్నారు. దీంతో జడ్చర్ల కాంగ్రెస్‌ మూడుముక్కలాటలా మారింది.
Tags:    

Similar News