రాజ్య‌స‌భ‌లో ట్రిపుల్ త‌లాక్ ఇష్యూ ఏం కానుంది?

Update: 2017-12-29 05:08 GMT
ఏదైనా అంశం మీద నిర్ణ‌యం తీసుకోవాల‌ని అధికార‌ప‌క్షం ఒక‌సారి డిసైడ్ కావాలే కానీ.. దానికి ఎన్ని అడ్డంకులు ఎదురైనా అధిగ‌మించే అవ‌కాశం ఉంటుంది. తాజాగా ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో అలాంటిదే క‌నిపిస్తుంద‌ని చెప్పాలి.  ట్రిపుల్ త‌లాక్ చ‌ట్ట‌విరుద్ధ‌మ‌ని సుప్రీంకోర్టు తేల్చి..ఆర్నెల్ల‌లో చ‌ట్టం చేయాల‌ని నిర్దేశించిన వేళ‌.. కొన్ని పార్టీలు ఈ అంశంపై వ్య‌తిరేకిస్తున్న వేళ‌.. లోక్ స‌భ‌లో త‌క్ష‌ణ  ట్రిపుల్ త‌లాక్‌ కు శిక్ష ప‌డేలా బిల్లును  గంట‌ల వ్య‌వ‌ధిలో జ‌రిగిన చ‌ర్చ‌ను ముగిస్తూ ఆమోదించారు.

బీజేపీ ఎంపీలు ఉత్సాహంతో బ‌ల్ల‌లు చ‌రుస్తున్న వేళ‌.. త‌క్ష‌ణ ట్రిపుల్ త‌లాక్ బిల్లుకు ఆమోద ముద్ర ప‌డింది. ఇక్క‌డి ఇది ముగిసిపోలేదు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఆస‌క్తిక‌ర‌మైన ఆట ఇక్క‌డే మొద‌లైంద‌ని చెప్పాలి. లోక్ స‌భ‌లో బీజేపీకి స్ప‌ష్ట‌మైన మెజార్టీ ఉంది. ఈ కార‌ణంతో బీజేపీ తానేం చేయాల‌నుకున్నా తేలిగ్గా పూర్తి చేయ‌గ‌ల‌రు.

కానీ.. అస‌లు తిప్ప‌లంతా రాజ్య‌స‌భ‌లోనే ఉంది. ఎందుకంటే.. పెద్ద‌ల స‌భ‌లో బీజేపీకి బ‌లం లేదు. మిత్ర‌ప‌క్షాల‌కు ఉన్న బ‌లాన్ని క‌లుపుకున్నా కూడా.. మేజిక్ మార్క్‌ ను ఇంకా ట‌చ్ చేయ‌ని ప‌రిస్థితి. రానున్న ఏడాదిలో కూడా అలాంటి అవ‌కాశం లేద‌నే చెప్పాలి. దీంతో రాజ్య‌స‌భ‌లో తక్ష‌ణ ట్రిపుల్ త‌లాక్ బిల్లును అధిగ‌మిస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

రాజ‌కీయ వ‌ర్గాల అంచ‌నా  ప్ర‌కారం.. ఈ బిల్లుకు కాంగ్రెస్ సూచిస్తున్న సూచ‌న‌ల్లో ఒక‌టో.. రెండింటినో ప‌రిగ‌ణ‌లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే.. కీల‌క అంశాల మార్పును సూచిస్తే మాత్రం.. నో చెప్పే అవ‌కాశం ఉంద‌ని చెప్పాలి. ట్రిపుల్ తలాక్ బిల్లుపై లోక్ స‌భ‌లో చ‌ర్చ సంద‌ర్భంగా.. కాంగ్రెస్ ధోర‌ణి చూస్తే.. పెద్ద‌గా వ్య‌తిరేకించిన‌ట్లుగా క‌నిపించ‌దు. కొన్ని అంశాల్లో మార్పులు చేయాల‌న్న మాట త‌ప్పించి.. అధిక శాతం మౌనంగా ఉంద‌నే చెప్పాలి.

ఈ నేప‌థ్యంలో కీల‌క‌మైన ఈ బిల్లుకు మౌనంగా సాయం చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా చెప్పాలి. ఇప్ప‌టివ‌ర‌కూ అనుస‌రించిన విధానాన్ని చూస్తే.. అధికారంలో ఎవ‌రు ఉన్నా.. కొన్ని కీల‌కాంశాల విష‌యంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం అండ‌గా ఉండ‌టం క‌నిపిస్తుంది. ఈ సంప్ర‌దాయాన్ని తాజా ఉదంతంలోనూ అమ‌లు చేసే వీలుంది. కొంత నిర‌స‌న స్వ‌రం వినిపించినా.. బిల్లు ఆమోద ముద్ర ప‌డేలా బీజేపీకి కాంగ్రెస్ అవ‌స‌ర‌మైన తోడ్పాటును అందిస్తుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అదే జ‌రిగితే.. బీజేపీ అనుకున్న‌ట్లే త‌క్ష‌ణ ట్రిపుల్ త‌లాక్ నేరంగా మారుతుంది. ముస్లిం మ‌హిళ‌ల‌కు స‌రికొత్త భ‌రోసా ల‌భిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News