క్యాచ్ మిస్ చేసినందుకు అతడ్ని అంతలా వేధించటమా?

Update: 2022-09-06 04:50 GMT
భారత్ - పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎంత హైటెన్షన్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు. అలాంటి కీలక మ్యాచ్ లో జరిగే చిన్న తప్పును అభిమానులు భూతద్దంలో చూడటమే కాదు.. దురభిమానాన్ని ప్రదర్శిస్తూ దారుణంగా వ్యవహరిస్తుంటారు. అప్పటివరకు ఎంత బాగా ఆడినా.. అలాంటివేమీ పట్టించుకోకుండా జరిగిన తప్పును పదే పదే ప్రస్తావిస్తూ.. అతడ్ని.. అతడి ఫ్యామిలీని టార్గెట్ చేయటం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్.

ఆసియా కప్ సూపర్-4లో భాగంగా ఆదివారం జరిగిన భారత్ - పాక్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలు కావటం తెలిసిందే. మ్యాచ్ లోని 18వ ఓవర్లో మూడో బంతికి రవి బిష్ణోయ్ వేసిన బంతిని అసిఫ్ అలీ స్వీప్ షాట్ ఆడగా.. సులువైన క్యాచ్ ను అర్షదీప్ జారవిడవటంతోనే మ్యాచ్ ఓడినట్లుగా విమర్శలు మొదలయ్యాయి. ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో చివరి ఓవర్లో ఇదే అర్షదీప్ సింగ్ రన్స్ ను తగ్గించేందుకు అతడు పడిన శ్రమ అంతా ఇంతా కాదు. అయినప్పటికీ అతని కష్టాన్ని.. కమిట్ మెంట్ ను పట్టించుకోకుండా క్యాచ్ విడిచిన వైనాన్ని టార్గెట్ చేస్తూ.. అతడ్ని హింసిస్తున్న వైనం షాకింగ్ గా మారింది.

అతడిపై విరుచుకుపడుతున్న వారికి కౌంటర్ గా సీనియర్ ఆటగాళ్ల నుంచి పలువురు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచినా.. అతడి మీద ఆన్ లైన్ దాడి ఆగట్లేదు. టీమిండియా మీద అభిమానం పేరుతో కొందరు చేస్తున్న చేష్టలు అతడిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

కీలక మ్యాచ్ లో క్యాచ్ మిస్ చేయటం ద్వారా మ్యాచ్ చేజారేలా చేశారన్న మంటను పలువురు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు అతిగాళ్లు.. అతడికి నిషేధిత సంస్థ ఖలీస్తాన్ తో సంబంధం ఉందంటూ విషపు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. అతని వికీపీడియా పేజీలో భారత్ స్థానంలో ఖలిస్తాన్ అంటూ ఎడిట్ చేయటం తీవ్ర దుమారంగా మారింది.

ఈ ఇష్యూ మీద కేంద్రం సీరియస్ అయ్యింది. వికీ పేజీలో చోటు చేసుకున్న తప్పుడు సమాచారం వల్ల మతసామరస్యం దెబ్బ తినటమే కాదు.. అర్షదీప్ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు బైకుల మీద తిరుగుతూ.. అర్షదీప్ అంతు చూస్తామంటూ నినాదాలు చేయటం తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో వికీపీడియా భారత్ ఎగ్జిక్యూటివ్ లకు కేంద్రం సమన్లు జారీ చేసింది. తప్పుడు సమాచారాన్ని ఎలా ఎడిట్ చేసి.. పబ్లిష్ చేస్తారో తమకు వివరణ ఇవ్వాలని కోరారు.

ఈ నేపథ్యంలో తప్పుడు సమాచారాన్ని ఎడిట్చేసిన వారు ఎవరన్న విషయాన్ని చెక్ చేయగా.. అన్ రిజిస్టర్  అకౌంట్ నుంచి చేసినట్లుగా గుర్తించారు. భారత్ స్థానే ఖలిస్తాన్ అంటూ అప్డేట్ చేసిన పావు గంటలోనే వికీ పీడియా ఎడిటర్స్ ప్రొఫైల్ ను సవరించినా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందన్న మాట వినిపిస్తోంది. కావాలని తప్పులు చేయని దానికి ఇంతలా వేధింపులకు గురి చేయటం దారుణమని చెప్పక తప్పదు. అభిమానం ఉండాలి కానీ అదెప్పుడూ దురభిమానంగా మారకూడదన్న విషయాన్ని మర్చిపోకూడదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News