కొత్త సీసాలో పాత సారా.. కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడి టీమ్‌పై ట్రోల్స్‌

Update: 2022-10-27 04:23 GMT
పురాత‌న కాంగ్రెస్ పార్టీ సార‌థిగా .. తాజాగా బాద్య‌త‌లు చేప‌ట్టిన క‌న్న‌డ నాయ‌కుడు.. మ‌ల్లికార్జున ఖ‌ర్గే.. ఆ వెంట‌నే కాంగ్రెస్‌ అత్యున్నత నిర్ణాయక మండలి సీడబ్ల్యూసీ స్థానంలో స్టీరింగ్‌ కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 47 మంది సీనియర్‌ నేతలతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ క‌మిటీలో ఉన్న స‌భ్యుల‌ను చూసిన త‌ర్వాత‌.. అంద‌రూ విస్మ‌యం వ్య‌క్తం చేశారు. కొత్త సీసాలో పాత సారా! అనే కామెంట్లు ఊపందుకున్నాయి.

స‌రే.. కామెంట్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఖ‌ర్గే టీమ్‌లో కాంగ్రెస్‌ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ వాద్రా, మాజీ మంత్రులు ఏకే ఆంటోనీ, అజయ్‌మాకెన్‌, అంబికా సోని, ఆనంద్‌శర్మ, జైరాం రమేష్‌, పి.చిదంబరం, కేసీ వేణుగోపాల్‌, దిగ్విజయ్‌సింగ్‌, సల్మాన్‌ఖుర్షీద్‌, రాజీవ్‌శుక్లా ఉన్నారు.  వీరంతా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న‌వారే. వీరి వ‌ల్లే క‌దా.. పార్టీ పుంజుకోవ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి మ‌ళ్లీ వీరితోనే టీమ్ ఏర్పాటు చేసుకోవ‌డం ఎందుకో.. ఏమిటో.. ఖ‌ర్గేకే తెలియాలి.

ఇక‌, మ‌రోవైపు..  మాజీ సీడబ్ల్యూసీ సభ్యులు, గ్రూప్-23 నేతలకు స్టీరింగ్ కమిటీలో చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి టి.సుబ్బిరామిరెడ్డికి అవకాశం దక్కింది. వాస్త‌వానికి ఈయ‌న‌కు ప్ర‌జా బ‌లం లేదు. ప‌ట్టుమ‌ని 100 మందిని క‌దిలించే శ‌క్తి కూడా లేదు. మ‌రి ఈయ‌న‌కు ఎందుకు అవ‌కాశం ఇచ్చారో తెలియాలి. ఇక‌, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాకూర్‌కు కూడా స్టీరింగ్‌ కమిటీలో చోటు దక్కింది. ఈయ‌న వ‌ల్ల పార్టీ పుంజుకుంటోందా? అనే ప్ర‌శ్న‌.. కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉంది. సో.. ఎలా చూసుకున్నా.. ఖ‌ర్గే టీమ్ మొత్తం.. కొత్త సీసాలో పాత‌సారా అనే మాట‌కు క‌ట్టుబ‌డిన‌ట్టుగానే క‌నిపిస్తోంది.

అంతకుముందు ప్రస్తుతం తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి బాధ్యతలను స్వీకరించారు ఖర్గే. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీతో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచినట్లు ధ్రువపత్రాన్ని ఖర్గేకు అందజేశారు పార్టీ ఎన్నికల కమిటీ ఇంఛార్జ్ మధుసూధన్ మిస్త్రీ.

ఈ సందర్భంగా మాట్లాడిన ఖర్గే.. ఇది తనకు భావోద్వేగంతో కూడిన క్షణమని పేర్కొన్నారు. సాధారణ కార్యకర్తను పార్టీ అధ్యక్షుడిగా చేసిన కాంగ్రెస్కు ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర.. దేశంలో నూతన ఉత్సాహాన్ని నింపుతోందని అన్నారు. 'ప్రస్తుతం ఉన్న విద్వేషాన్ని, అబద్ధపు సంకెళ్లను కాంగ్రెస్ పార్టీ ఛేదిస్తుంది. 50ఏళ్ల లోపు నేతలకు 50 శాతం సీట్లు ఇవ్వాలన్న ఉదయ్పుర్ డిక్లరేషన్లోని ప్రతిపాదనను అమలు చేస్తాం' అని ఖర్గే పేర్కొన్నారు.

కొస‌మెరుపు ఏంటంటే.. ఇప్పుడు ఖ‌ర్గే ఏర్పాటు చేసుకున్న కొత్త టీమ్‌లో ఉన్న‌వారంతా.. వ‌యోవృద్ధులు కావ‌డం.. అంద‌రూ ఏకంగా 60 ఏళ్లు నిండిన వారు కావ‌డం గ‌మ‌నార్హం.(ఒక్క రాహుల్‌, ప్రియాంక త‌ప్ప‌)


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News