స్మృతి ఇరానీ బ్యాడ్ టైమ్

Update: 2015-06-24 15:38 GMT
కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీకి సమయం కలిసిరావడం లేదు. డిగ్రీ ఉత్తీర్ణురాలిని అని పేర్కొంటూ  స్మృతి ఇరానీ సమర్పించిన అఫిడవిట్లు నకిలీ అనే వివాదంలో దాఖలైన పిటిషన్ ను ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌ కోర్టు విచారణకు స్వీకరించింది. దీంతోపాటు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.


స్మృతి ఇరానీ నకిలీ డిగ్రీ కలిగి ఉన్నారని పేర్కొంటూ అహ్మర్ ఖాన్ అనే వ్యక్తి ఢిల్లీ మెట్రోపాలిటన్‌ మెజిస్ర్టేట్‌ కోర్టులో కేసు దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి ఆమె సమర్పించిన మూడు అఫిడవిట్లు ప్రస్తావిస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. స్మృతి ఇరానీ ఎన్నికల్లో పోటీ చేసిన మూడు సార్లు విద్యార్హతకు సంబంధించిన వివరాలు మూడు విధాలుగా పేర్కొన్నట్లు పిటిషన్ దాఖలు చేసినట్లు న్యాయస్థానానికి ఖాన్ విన్నవించారు. 

2004 ఎన్నికల్లో లోక్‌సభకు పోటీ చేసినప్పుడు 1996లో ఢిల్లీ యూనివర్శిటీలో తాను బీఏ చదివినట్లు స్మృతి ఇరానీ ఆఫిడవిట్‌లో పేర్కొన్నారని ఫిర్యాదుదారు వివరించారు. 2011 రాజ్యసభ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీ యూనివర్శిటీలో కరస్పాండెంట్‌ ద్వారా బీ.కాం చేసినట్లు తెలిపారని విన్నవించారు. 2014లో అమేథి నుంచి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై పోటీ చేసినప్పుడు బీకాంతో తో పాటు , తనకు ప్రఖ్యాత ఏల్‌ యూనివర్శిటీ నుంచి కూడా డిగ్రీ ఉందని ఆఫిడవిట్‌లో పేర్కొన్నారని పిటిషనర్ ప్రస్తావించారు. 

ఈ నేపథ్యంలో స్మృతి ఇరానీ చదివిన డిగ్రీ కోర్సుపై ఖాన్‌ ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్‌ వేశారు. కేంద్రమంత్రికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం స్వీకరించింది. విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి విచారణను ఆగస్టు 28కు వాయిదా వేసి ఆలోగా ఆఫిడవిట్‌ దాఖలు చేయాలని స్మృతి ఇరానీకి కోర్టు ఆదేశించింది.
Tags:    

Similar News