కోనసీమలో ఇంటర్నెట్ బంద్ తో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు కష్టాలు!

Update: 2022-05-28 04:06 GMT
ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో అల్లర్లు, విధ్వంసం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సాగిన విధ్వంసకాండ కుట్ర వెనుక సూత్రధారులు, దాడుల్లో పాత్రధారులను అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే వీడియో క్లిప్పింగులు, సోషల్‌ మీడియా పోస్టులు, కాల్‌ డేటా, సీసీ టీవీ ఫుటేజ్‌ల ఆధారంగా కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీడియో క్లిప్పింగుల ఆధారంగా 70 మందికిపైగా నిందితులను గుర్తించారు.

ఇప్పటికే 19 మందిని అరెస్టు చేశారు. మరో 24 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులపై వివిధ సెక‌్షన్ల కింద ఆరు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ప్రత్యేక బృందాల ద్వారా మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ నెల 24న అమలాపురం పట్టణంలో పలు కూడళ్లలో ఉన్న సీసీ పుటేజ్‌లు, వాట్సాప్‌ గ్రూపులు, టీవీ చానల్స్‌లో ప్రసారమైన దృశ్యాలను ఆధారంగా చేసుకుని నిందితులను గుర్తిస్తున్నారు.

కాగా, మే 24 నుంచి అమలాపురం పట్టణంతోపాటు, కోనసీమలో పోలీసులు ఇంటర్నెట్ ను నిషేధించిన సంగతి తెలిసిందే. అన్ని మొబైల్ సర్వీసులతో ఇంటర్నెట్ లను పోలీసులు ఆపివేయించారు. అల్లర్లకు సంబంధించిన మెసేజులు, పోస్టులు, పుకార్లు సోషల్ మీడియా ద్వారా వ్యాపించకుండా ఉండటానికే ఈ చర్యలు చేపట్టారు. మరికొన్ని రోజులు ఇంటర్నెట్ పై నిషేధం కొనసాగుతుందని చెబుతున్నారు.

కాగా ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టు ఇంటర్నెట్ ను నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వర్కు ఫ్రమ్ హోమ్ విధానంలో ఇంటి నుంచి పనిచేసుకుంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు తీవ్ర కష్టాలు తెచ్చిపెట్టింది. ఇంటర్నెట్ రాకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం త్వరగా ఇంటర్నెట్ పై నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నారు.

గోదావరి ఒడ్డున ఇంటర్నెట్ వస్తుండటంతో అక్కడికి వెళ్లిపోయి పనిచేసుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లంతా ల్యాప్ ట్యాపులు పట్టుకుని గోదావరి తీరానికి పరుగెడుతున్నారు. అక్కడ కూర్చుని కంపెనీ తమకిచ్చిన టాస్కులను పూర్తి చేసుకుంటున్నారు. ముఖ్యంగా ముక్తేశ్వరంలో మాత్రమే ఇంటర్నెట్ కొంచెం వస్తోంది. దీంతో అక్కడికి వెళ్లి సాప్ట్ వేర్ ఇంజనీర్లు తమ పని కానిచ్చుకుంటున్నారు. ప్రభుత్వం ఇంటర్నెట్ పై మరికొన్ని రోజులు నిషేధం కొనసాగుతుందని చెబుతుండటంతో వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్నెట్ రాకపోతుండటంతో తమకు వర్కు ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. దీంతో కంపెనీలు తమకిచ్చిన టాస్కులను సకాలంలో పూర్తి చేసి పంపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలాంటి వారికోసమైనా ఇంటర్నెట్ నిషేధంపై సడలింపులు ఇవ్వాలని కోరుతున్నారు.

మరోవైపు వ్యాపారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే చెల్లింపులు నిలిచిపోవడంతో వినియోగదారులు, వ్యాపారులకు సమస్యలు తప్పడం లేదు. కేవలం నగదు రూపంలో మాత్రం లావాదేవీలకు ఆస్కారం ఉంటోంది. దీంతో సరిపోయినంత చిల్లర లేక వ్యాపారులకు, నగదు లభ్యత లేక వినియోగదారులు కష్టాలు పడుతున్నారు.
Tags:    

Similar News