కరీంనగర్ లో టీఆర్ఎస్‌ - బీజేపీ శ్రేణుల ఘర్షణ....హై టెన్షన్

Update: 2021-01-25 17:30 GMT
తెలంగాణలో దుబ్బాక ఉపఎన్నిక ఫలితం తర్వాత బీజేపీ జోరు పెంచిన సంగతి తెలిసిందే. దుబ్బాక గెలుపు ఇచ్చిన జోష్ తో జోరుమీదున్న కమలనాథులు బల్దియా బరిలోనూ టీఆర్ ఎస్ కు గట్టి పోటీనిచ్చి మంచి ఊపుమీదున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై తెలంగాణ బీజేపీ అధ్యక్షఉడు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో, అదును చిక్కినప్పుడల్లా బండి సంజయ్ పర్యటనలను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటు నిరసన తెలుపుతున్నారు.

దీంతో, బీజేపీ, టీఆర్ ఎస్ కార్యకర్తల మధ్య ఒకటి రెండు సార్లు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే తాజాగా కరీంనగర్ లో మరోసారి టీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యర్తలు ఘర్షణ పడ్డారు. బండి సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం విషయంలో ఇరు పార్టీల కార్యకర్తలు, నాయకుల మధ్య వివాదం ముదిరి తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడడంతో పరిస్థితి అదుపు తప్పింది.

ఈ క్రమంలోనే పరస్పరం దాడి చేసుకుంటున్న వారిని అడ్డుకోబోయిన పోలీసులనూ వారు తోసివేశారు. ఈ క్రమంలోనే పరిస్థితిని అదుపు చేసే క్రమంలో కరీం నగర్ టూటౌన్ సీఐ లక్ష్మిబాబు కిందపడిపోయారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. తోపులాటలో సీఐ పడిపోవడంతో ఆగ్రహించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఈ గొడవ నేపథ్యంలో నగరంలో ఉద్రిక్తత ఏర్పడింది.

దీంతో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో ముమ్మరంగా పోలీసులను మోహరించారు. అంతకుముందు, కేసీఆర్ పై‌ బండి సంజయ్‌ వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్ఎస్‌ కార్యకర్తలు సంజయ్‌ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ చౌక్‌ దగ్గర  దిష్టిబొమ్మ దహనం చేయబోతుండా...ప్రభుత్వం అవలంబిస్తోన్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు బీజేపీ నేతలు కూడా తెలంగాణ చౌక్ కు చేరుకున్నారు. దిష్టిబొమ్మ దహనాన్ని బీజేపీ శ్రేణులు అడ్డుకునేందుకు యత్నించగా...ఇరువర్గాల మధ్య ఘర్ఫణ జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Tags:    

Similar News