క‌విత‌క్క ద‌గ్గ‌ర అటెండెన్స్ వేయించుకోవాల్సిందేనా?

Update: 2019-02-22 04:45 GMT
తెలంగాణ రాజ‌కీయం ఆస‌క్తిక‌రంగా మారింది. విప‌క్షం అడ్ర‌స్ గ‌ల్లంతు కావ‌టం.. కేసీఆర్ కు తిరుగులేని రీతిలో త‌యారు కావ‌టం ఒక ఎత్తు అయితే.. ఆయ‌నేం అనుకున్నారో అదే ఫైన‌ల్ అన్న ప‌రిస్థితి. ఫ‌లితాలు వెల్ల‌డైన త‌ర్వాత ఎమ్మెల్యేల ప్ర‌మాణ‌స్వీకారానికి చాలా స‌మ‌యం తీసుకున్నా.. మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌కు ఏకంగా 69 రోజులు తీసుకున్నా.. రెండోసారి సీఎం అయ్యాక నేటి వ‌ర‌కూ స‌చివాల‌యం ముఖం చూడ‌కున్నా.. ఇలా విష‌యం ఏదైనా కేసీఆర్ ఏమ‌నుకుంటే అదే జ‌రిగే ప‌రిస్థితి.

ఎందుకిలా చేస్తున్నారు? అంటూ అడిగే ద‌మ్ము.. ధైర్యం ఎవ‌రికి లేని ప‌రిస్థితి. చివ‌ర‌కు సొంత మేన‌ల్లుడు హ‌రీశ్ రావుకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాల్ని తీసుకుంటున్న కేసీఆర్ తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తానేం చేయాలో అదే చేస్తాన‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే కేసీఆర్ తీరు ఈ ర‌కంగా ఉంటే.. తెలంగాణ అధికార‌ప‌క్షంలో మ‌రో ఆస‌క్తిక‌ర కోణం ఇప్పుడు క‌నిపిస్తోంది.

మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అనంత‌రం.. మంత్రులుగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన ప‌లువురు మంత్రులు ఎంపీ క‌విత నివాసానికి వెళ్లి ఆమెను క‌లుస్తున్నారు. మ‌ర్యాద‌పూర్వ‌కంగా అనండి.. క‌విత‌క్క ఆశీస్సుల కోసం అనండి.. అక్క ఆశీస్సుల‌తో పెద్దాయ‌న మ‌న‌సును సంతోష‌ప‌డేలా చేసేందుకు కావొచ్చు. కార‌ణం ఏదైనా క‌విత‌క్క ఇంటికి క్యూ క‌డుతున్న మంత్రుల తీరు చూస్తే.. తెలంగాణ రాష్ట్రంలో రాజ‌కీయం ఎలాంటి ప‌రిస్థితుల్లోకి వెళుతుంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

కేసీఆర్ సెంట్రిక్ గా న‌డుస్తున్న టీఆర్ ఎస్ రాజ‌కీయాలు ఇప్పుడు కేటీఆర్.. క‌విత‌క్క కేంద్రంగా సాగుతున్న కొత్త ప‌రిణామం గులాబీ పార్టీలో చోటు చేసుకుంటోంది. గ‌తంలో త‌మ సంతోషాన్ని.. ఆనందాన్ని కేటీఆర్ కంటే హ‌రీశ్ తోనే ఎక్కువ‌మంది టీఆర్ ఎస్ నేత‌లు పంచుకునే వారు. కానీ.. మారిన సీన్ తో పాటు.. అధినేత మ‌న‌సుకు త‌గ్గ‌ట్లుగా కేసీఆర్ కుమారుడు.. కుమార్తెకు టీఆర్ ఎస్ పార్టీలో అత్య‌ధిక గుర్తింపు ఉంద‌న్న విష‌యాన్ని కొత్త మంత్రులు బాగానే అర్థం చేసుకుంటున్న‌ట్లు చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News