ఈటలపై టీఆర్ఎస్ ఎదురుదాడి

Update: 2021-05-04 17:30 GMT
తెలంగాణలో ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ ఈటలగా మారిపోయింది. భూకబ్జా ఆరోపణలపై ఈటలను మంత్రి వర్గం నుంచి కేసీఆర్ తీసేశారు. ఆయన బయటకు వచ్చి మీడియా ముందుర కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో అనుకున్నట్టుగానే ఇంతకాలం సైలెంట్ గా ఉన్న టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఎదురుదాడి మొదలుపెట్టారు. ఈటలపై విరుచుకుపడుతున్నారు.

నిన్న కూడా ఈటల ఇదే అన్నారు. కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ తనకు సన్నిహితులైన వారితోనే రేపటి నుంచి విమర్శల దాడి చేయిస్తారని ఖచ్చితంగా అంచనా వేశారు. ఆ అంచనా నిజమైంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటల సన్నిహితులైన టీఆర్ఎస్ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పల ఈశ్వర్, మాజీ ఎంపీ వినోద్ లు బయటకు వచ్చి  కేసీఆర్ ను తిట్టిన ఈటలపై దుమ్మెత్తి పోశారు.

ఈటలకు పార్టీలో గౌరవం ఇవ్వడం లేదన్న ఆరోపణల్లో నిజం లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం, కేసీఆర్ పై ఈటల ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. మూడు , నాలుగేళ్లుగా పార్టీకి వ్యతిరేకంగా ఈటల మాట్లాడుతున్నారని.. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కావడం లేదన్నారు.టీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా.. మంత్రిగా ఈటలకు అత్యంత గౌరవం దక్కిందని కొప్పులు చెప్పుకొచ్చారు. ఈటల ఆత్మగౌవరం ఎక్కడ దెబ్బతిందో చెప్పాలన్నారు.

ఇక ఈటల రాజేందర్ ఒక మేనవన్నె పులి అని మరో మంత్రి గంగుల తీవ్ర విమర్శలు చేశారు. బీసీ ముసుగు కప్పుకున్న పెద్ద దొర అని ఘాటు విమర్శలు చేశారు. ఈటల హుజూరాబాద్ వస్తే బీసీ.. హైదరాబాద్ కు వస్తే ఓసీ అవుతారని విమర్శించారు. ఈటలకు అత్యంత సన్నిహితుడైన గంగుల ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనమైంది. ఇక కేసీఆర్ పథకాలను ఈటల ఎన్నో సార్లు చులకన చేసి మాట్లాడారని మాజీ ఎంపీ వినోద్ ఆడిపోసుకున్నారు.

ఇలా ఈటలపై ఒక్కసారిగా టీఆర్ఎస్ దండు పడిపోయింది. ఇన్నాళ్లు సన్నిహితంగా మెలిగిన నేతలే ఇప్పుడు విమర్శలు గుప్పించుకోవడం విశేషంగా మారింది.
Tags:    

Similar News