టీఆర్ ఎస్.. సీపీఐ కోట్లాట: గులాబీ కార్యకర్త చనిపోయాడు

Update: 2016-06-03 04:41 GMT
తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకల్లో సింహ భాగం తెలంగాణఅధికారపక్షం టీఆర్ ఎస్ హడావుడే ఎక్కువగా కనిపిస్తుంది. ఇదిలా ఉంటే..మిగిలిన జిల్లాల్లో మాదిరి ఖమ్మం జిల్లా గూడూరుపాడులో టీఆర్ ఎస్ కార్యకర్తలు తెలంగాణ ఆవిర్భావ వేడుకల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈసందర్భంగా టీఆర్ ఎస్.. సీపీఐ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఈ వ్యవహారంలో సీపీఐ కార్యకర్తలు రాళ్లు విసరటం.. ఒక రాయి వచ్చి నేరుగా ఒక గులాబీ కార్యకర్తను తగలటంతో సదరు కార్యకర్త అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.మరో ముగ్గురు టీఆర్ ఎస్ కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన టీఆర్ ఎస్ లో కలకలమే రేపింది. పండుగ పూట ఇలాంటి పరిణామం చోటు చేసుకోవటం పార్టీ వర్గాల వారిని కలిచివేసింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించటమే కాదు.. ఇలాంటివి దురదృష్టకరమని.. ఈ తరహా ఘటనలకు పాల్పడిన వారికి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఏమైనా ఓపక్క తెలంగాణ ఆవిర్భావదినోత్సవ వేడుకలు ధూంధాంగా జరుగుతున్న వేళ.. పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటం దురదృష్టకరమనే చెప్పాలి.
Tags:    

Similar News