టీఆర్‌ఎస్‌ అసంతృప్తులు చూపు ఈటల వైపు .. ఏం జరగబోతోంది!

Update: 2021-05-03 07:52 GMT
తెలంగాణ రాజకీయంలో పెను సంచలనం. నిన్న మొన్నటి వరకు ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంతో బిజీగా ఉండే ఈటల, భార్య జమున పేరిట ఉన్న హ్యాచరీస్‌ కోసం అసైన్డ్‌ భూములను కబ్జా చేశారని ప్రభుత్వానికి నివేదిక వెళ్లడం, ఆ వెంటనే వేగంగా ఆయన్ని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడం , ఆ మేరకు గవర్నర్‌ నుంచి ఉత్తర్వులు వెలువడటంతో ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్తు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజాగా ఈటల మీడియా సమావేశం నిర్వహించి కేసులకు, అరెస్టులకు ఈటల బయపడేవాడు కాదు అని స్పష్టం చేశారు. అలాగే సీఎం కేసీఆర్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈటల మాత్రం ముందుచూపు ధోరణితో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

మొదటి నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమంలో, టీఆర్‌ ఎస్‌ పార్టీలో ఈటల కీలకంగా వ్యవహరించారు. అకస్మాత్తుగా టీఆర్‌ ఎస్‌ అధిష్ఠానం ఈటలపై చర్యలు తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నుంచి ఆయనకి సానుభూతి లభిస్తోంది. ఈ నేపథ్యంలో తనతో కలిసొచ్చే వారితో త్వరలోనే ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఈటల నిమగ్నమైనట్లు ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలు టీఆర్‌ ఎస్‌ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. అందులో కొంతమంది ఇప్పటికే ఈటల తో సంప్రదింపులు చేపడుతున్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘం, బీసీ కులాల ఐక్యవేదిక, ఎమ్మార్పీఎస్‌, సగర కులసంఘం, లంబాడి ఐక్యవేదిక, ముదిరాజ్‌ సంఘంతో పాటు పలు సంఘాల నేతలు ఈటలను కలిసి తమ మద్దతును ప్రకటించారు. తన నియోజకవర్గం హుజురాబాద్‌ లోనూ త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఆయన సన్నిహితులు అనుకుంటున్నారు. ఈటలను మంత్రి పదవి నుంచి తప్పించడంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్‌ అనే యువకుడు పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. కాగా, రాష్ట్రంలో 93 శాతంగా ఉన్న దళిత, బహుజనుల కోసం పార్టీ స్థాపించాలని ఈటల రాజేందర్‌ ను ఓయూ దళిత బహుజన విద్యార్థులు కోరారు. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కానని వ్యాఖ్యానించారు. వ్యక్తులు శాశ్వతం కాదని.. వ్యవస్థ శాశ్వతం అని పేర్కొన్నారు. భూముల వ్యవహారంలో సంబంధిత గ్రామ సర్పంచ్ ఉదయం ఒక మాట చెప్పారు.. సాయంత్రానికి ఒక మాట మార్చారని ఈ సందర్భంగా ఈటల గుర్తు చేశారు.
Tags:    

Similar News