గులాబీ ఫోకస్ : ఏపీ రాజకీయాల్లో కొత్త మోజు...?

Update: 2022-05-30 23:30 GMT
రాజకీయాలు అన్నవి ఎపుడూ పారే నదిలా సాగుతూనే ఉంటాయి. అవి నిశ్చలంగా ఒక చోట ఉండే అవకాశం లేదు, అలా ఉంటే అది పాలిటిక్స్ కానే కాదు. అందుకే నిన్న బాగుంది అనుకుంటే నేడు తల్లకిందులు అవుతుంది. ఇక చూస్తే ఇప్పటిదాకా ఏపీలో వైసీపీదే పై చేయి అని అంతా అనుకున్నారు. వరసబెట్టి ఎన్నికల్లో ఓడిపోతూ నీరు కారిపోతూ టీడీపీ ఉంది. జగన్ కి ఉన్న ప్రజాకర్షణ, ఆయనకు జనాలు ఇచ్చిన అద్వితీయ మెజారిటీ వంటి అనేకానేక కారణాల వల్ల మరోమారు కూడా ఆయనే వస్తారు అని అంతా అనుకున్న పరిస్థితి.

ఇక పొరుగు రాష్ట్రం అయిన తెలంగాణాలో కూడా గులాబీ పార్టీ అదే తలుస్తూ వస్తోంది. పైగా జగన్ జిగినీ దోస్త్ కూడా. చంద్రబాబు ఏపీలో సీఎం గా ఉంటే ఆయన ఒకనాటి శిష్యుడిగా కేసీయార్ కి అదో రకం ఇబ్బంది అని కూడా ప్రచారంలో ఉన్న మాట. అదే జగన్ అయితే పొలిటికల్ గా జూనియర్ కాబట్టి ఏపీలో కూడా తమ పాలన ఉన్నట్లే అని కేసీయార్ భావించే 2014 నుంచి 2019 దాకా మద్దతు ఇస్తూ వచ్చారు.

అయితే జగన్ గెలిచిన తరువాత  మొదటి ఆరు నెలల పాటు సవ్యంగా సాఫీగా సాగిన ఈ ఇద్దరి స్నేహం ఆ తరువాత మాత్రం వికటించింది. ఏపీకి తెలంగాణాకు మధ్య జల వివాదాలు ఉన్నాయి. అవి ఇద్దరి మధ్యన పొత్తు లేకుండా చేశాయి. దాని కంటే మరింత ఎక్కువగా రాజకీయం ఈ ఇద్దరినీ దూరం చేసింది అంటున్నారు. మోడీ వైపు జగన్ ఉంటే కేసీయార్ మాత్రం యాంటీ మోడీ స్లోగన్ తో ముందుకు పోతున్నారు.

అసలు కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ కి అతి పెద్ద ఇరుసు జగన్ అనుకున్నారు. కానీ జగన్ మాత్రం సీఎం కాగానే తన పొలిటికల్ రూట్ మార్చేశారు. ఈ నేపధ్యంలో కేసీయార్ దేశమంతా తిరుగుతున్నారు కానీ ఏపీ వైపు తొంగి చూడడంలేదు. ఇక జాతీయ రాజకీయాల తీరు చూస్తే వారికి కూడా ఒక డౌట్ వస్తుంది కదా. సాటి తెలుగు రాష్ట్రం మద్దతు సాధించలేని కేసీయార్ తమతో జట్టు కట్టి ఏం సాధిస్తారు అన్న డౌటానుమానాలు వారిలో కలుగుతాయి కదా.

సరిగా ఇక్కడే కేసీయార్ ప్లాన్స్ కూడా వికటిస్తున్నాయని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఎంతో కొంత చికాకు పెట్టడానికి జగనే కారణం అని గులాబీ బాస్ గుర్రుగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో టీడీపీ గ్రాఫ్ పెరగడం, చంద్రబాబుకు జనాదరణ కూడా గతం కంటే ఎక్కువగా ఉండడాన్ని గులాబీ పార్టీ నిశితంగా పరిశీలిస్తోంది అంటున్నారు.

దాంతో పాటు ఏపీలో మూడేళ్ళుగా అభివృద్ధి లేకపోవడం జగన్ మీద జనాల్లో వ్యతిరేకతను పెంచుతోందని కూడా టీయారెస్ లో విశ్లేషించుకుంటున్నారు అని తెలుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు ఏపీలో అధికారంలోకి వచ్చినా తప్పులేదు అన్న ఆలోచన టీయారెస్ లో ఇపుడు గట్టిగా ఉందని అంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే చంద్రబాబు ఏపీలో మళ్ళీ గెలిచినా ఆయన కచ్చితంగా అయిదేళ్ల పాటు ఏపీకే సీఎం గా పరిమితం అవుతారు.

ఇపుడున్న పరిస్థితుల్లో ఆయన జాతీయ రాజకీయాల వైపు అసలు  దృష్టి పెట్టలేరు.  ఆయన అక్కడ బాగా కుదురుకోవాలి. సరిగ్గా ఇదే  టీయారెస్ కి అడ్వాంటేజ్ కాబోతోంది. జాతీయ రాజకీయాల మీద ఆసక్తితో ఉన్న కేసీయార్ కి కూడా ఇదే కావాలి.  అదే విధంగా చూస్తే ఎన్నికల తరువాత యాంటీ మోడీ పార్టీలు బలం పెంచుకుంటే కచ్చితంగా చంద్రబాబు మద్దతు అటు వైపే ఉంటుంది అని కూడా టీయారెస్ పెద్దలు  నమ్ముతున్నారు. ఆయన గతంలో యాంటీ మోడీ పక్షాలతో పనిచేశారని గుర్తు చేస్తున్నారు.

ఆ విధంగా చంద్రబాబు మద్దతు కూడా దక్కితే కేసీయార్ జాతీయ రాజకీయానికి మంచి ఆలంబన ఏర్పడుతుంది అని కూడా భావిస్తున్నారుట. అందుకే ఈసారి పనిగట్టుకుని మరీ చాలా మంది టీయారెస్ మంత్రులు శతజయంతి వేళ ఎన్టీయార్ ఘాట్ వద్ద అన్న గారికి ఘన నివాళులు అర్పించారు అంటున్నారు. అది టీడీపీకి గులాబీ పార్టీ పంపించే గ్రీన్ సిగ్నల్ అని అంటున్నారు.

ఇక జగన్ విషయానికి వస్తే కచ్చితంగా మోడీ క్యాంప్ మనిషి అని నమ్మడం వల్లనే ఆయనను దూరం పెట్టాలని కూడా గులాబీ పార్టీ చూస్తోంది అంటున్నారు. మొత్తానికి రాజకీయలలో బంధాలు ఎపుడూ ఒకలా ఉండవని అంటారు. అందుకే ఇపుడు చంద్రబాబు మీద తెలంగాణా చంద్రుడు మోజు పడుతున్నారు అని చెబుతున్నారు.

ఏపీలో ఎపుడు ఎన్నికలు జరిగినా జగన్ కి టీయారెస్ నుంచి సాయం ఉండదనే అంటున్నారు. అదే సమయంలో చంద్రబాబుకు ఇండైరెక్ట్ గా కారు పార్టీ నుంచి ఫుల్ సపోర్టు  దక్కే చాన్స్ ఉందని కూడా అంటున్నారు. మరి ఈ రాజకీయ పరిణామాలను చూసే తెలంగాణా మంత్రులు అదే పనిగా జగన్ మీద ఆయన ప్రభుత్వం మీద అలవోకగా విమర్శలు చేస్తున్నారు అని అంటున్నారు. సో ఏపీలో గులాబీ మోజు పెంచుకున్న పార్టీ ఒకటి గతంలో గెలిచింది. మరి ఇపుడు ఆ పార్టీ  మోజు మారుతోంది. ఇపుడు కూడా టీయారెస్ గెలుస్తుందా. వెయిట్ అండ్ సీ.
Tags:    

Similar News