మిత్రుడిపై దర్యాప్తుకు టీ సర్కారు ఓకే

Update: 2017-03-05 05:04 GMT
కలిసి పోటీ చేయకున్నా.. ఇరు పార్టీల మధ్య ఎలాంటి రాజకీయ ఒప్పందం లేకున్నా.. మజ్లిస్ ను మిత్రపక్షంగా చెప్పుకుంటుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.  ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు పోటీ చేసుకున్నప్పటికీ.. మజ్లిస్ ను తమ ఫ్రెండ్లీ పార్టీగా మాట్లాడుతుంటారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తమ మిత్రుడిగా మజ్లిస్ ను చెప్పుకున్నప్పటికీ ప్రభుత్వ విధానాల్నితప్పు పట్టే విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ ఏ మాత్రం మొహమాటపడరు.

మిగిలిన విపక్షాల కంటే ఒక ఆకు ఎక్కువ చదివినట్లుగా లా పాయింట్లు తీసి మరీ.. అసెంబ్లీలో అధికారపక్షాన్ని తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారు. మరో చిత్రమైన విషయం ఏమిటంటే.. ఏ రాజకీయ పార్టీ నేతల అయినా తమను ఒక్క మాట అన్నా చెలరేగిపోయే టీఆర్ ఎస్ నేతలు.. మజ్లిస్ నేతల నోటి నుంచి వచ్చే మాటలకు మాత్రం పెద్దగా రియాక్ట్ అయినట్లుగా కనిపించరు.

మొత్తంగా చూస్తే.. మజ్లిస్.. టీఆర్ ఎస్ మధ్య రిలేషన్ ఫ్రెండ్ షిప్.. ఫ్రెండ్ షిప్పే.. పేకాట పేకాటే అన్న రీతిలో ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మజ్లిస్ బాటలోనే టీ సర్కారు నడుస్తున్నట్లుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా హిందువుల మనోభావాల్నికించపరిచేలా మాట్లాడిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై నమోదైన కేసు దర్యాప్తు కొనసాగించేందుకు రాష్ట్ర సర్కార్ కరీంనగర్ పోలీసులకు అనుమతులివ్వటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఉమ్మడి రాష్ట్రం (2012 ఆగస్టు 22న) లో ఉన్నప్పుడు కరీంనగర్ సభలో అక్బరుద్దీన్ ముస్లిం యువకుల్ని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ స్థానికన్యాయవాది బేతి మహేందర్ రెడ్డి కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వాదనకు సాక్ష్యంగా వీడియో టేపును ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు.

దీంతో.. ఆయన కోర్టు దృష్టికి ఈ ఉదంతాన్ని తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కోర్డు ఆదేశాల నేపథ్యంలో కరీంనగర్ త్రీ టౌన్  పోలీసులు 2013లో అక్బరుద్దీన్ ఓవైసీ మీద కేసు నమోదు చేశారు. అనంతరం సార్వత్రిక ఎన్నికలు రావటం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. టీఆర్ ఎస్ సర్కారు కొలువు తీరటంతో దర్యాప్తు సాగలేదు. ఇదంతా జరిగి దాదాపు నాలుగేళ్ల తర్వాత..అక్బరుద్దీన్ పై నమోదైన కేసుపై దర్యాప్తునకు ఓకే అంటూ తెలంగాణ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకోవటం ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News