గులాబీ గుబులు; ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యిందే

Update: 2015-06-23 17:30 GMT
ఇవాళ.. రేపటి రోజున అపర చాణుక్యుడు అన్న వాడు ఎవడూ ఉండరన్న మాట మరోసారి రుజువైంది. నిన్నమొన్నటివరకూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలివితేటలకు విపరీతంగా మురిసిపోయిన వారు సైతం.. కదిలించుకోవటం ఎందుకు? కంప మీద వేసుకోవటం ఎందుకు? అని అనుకునే పరిస్థితి. ఉమ్మడి రాజధానిలో ఏపీ అధికారాలు అడగకుండా చేయగలిగిన పరిస్థితుల్లో ఉంటూ రాజకీయంగా లబ్థి పొందుతున్న అధికారపక్షం అత్యాశతో.. తెలుగు తమ్ముళ్లను దెబ్బ కొట్టాలన్న వ్యూహాం బెడిసి కొట్టి.. మొదటికే మోసం వచ్చిన పరిస్థితి.

ఓటుకు నోటు వ్యవహారంతో తెలుగుదేశం పార్టీని మొత్తంగా దెబ్బేయాలనుకున్న వ్యూహాం మొదట్లో బాగానే వర్క్‌వుట్‌ అయినా.. అది కాస్త అటూఇటూ తిరిగి ఇప్పుడు.. హైదరాబాద్‌లో ఎవరి అధికారాలు ఏంటన్న వరకూ విషయం వెళ్లటం.. దీనిపై అటార్నీ జనరల్‌ అంతటి పెద్దమనిషి.. ఏపీకి అనుకూలంగా ఉన్న తీర్పు చెప్పటంతో తెలంగాణ అధికారపక్షం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది.

ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణలోనూ.. అటూ ఆంధ్రాలోనే తెలుగుదేశం పార్టీని.. ఆ పార్టీ అధినేతను ఏదో చేద్దామనుకున్న మాస్టర్‌ప్లాన్‌ బెడిసి కొట్టినట్లుగా రాజకీయ పరిశీలికులు అంచనా వేస్తున్నారు. తాజాగా గవర్నర్‌ నరసింహన్‌ను కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌.. సెక్షన్‌ 8ను హైదరాబాద్‌లో ఏ విధంగా అమలు చేస్తారని ప్రశ్నించటంతో పాటు.. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామన్న సంకేతాలు ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఆంధ్రా వారిపై దాడులు ఎక్కడా జరగలేదని.. సెక్షన్‌ 8ను విధించాలని కేంద్రం చూస్తే.. మరో ఉద్యమం తప్పదని ఆయన స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. అసలీ పంచాయితీ అంతా ఓటుకు నోటు వ్యవహారంతోనే వచ్చింది కదా. అదే కానీ.. లేకపోతే.. ఈ సెక్షన్‌ బయటకు వచ్చేది కాదు కదా అని ఫీలైపోతున్న గులాబీ నేతలు ఉన్నారు. ఏదో చేద్దామని అనుకుంటే చివరకు ఏదో అయిన చందంగా పరిస్థితి మారిందని వారు వాపోతున్నారు.

Tags:    

Similar News